Pink lips : గులాబీ రంగు అదరాల కోసం అదిరిపోయే ఇంటి చిట్కాలు
పెదవుల్ని సహజంగా మాయిశ్చరైజింగ్గా, గులాబీ రంగులో ఉంచుకునేందుకు బోలెడు ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చదివేసి, నచ్చిన వాటిని ప్రయత్నించేయండి.
Pink lips naturally at home కొంత మంది పెదవులు గులాబీ రంగులో, చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తాయి. కానీ చాలా మందికి మాత్రం పెదవులు సహజమైన గులాబీ రంగులో ఉండవు. కాస్త నల్లటి ఛాయలోకి మారిపోతుంటాయి. ఇలా పెదవులు ముదురు రంగులోకి మారిపోవడానికి కారణాలు లేకపోలేదు. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం, విటమిన్ల లోపం, అనారోగ్య కారణాలకు వాడే కొన్ని రకాల ఔషధాలు, గర్భ ధారణ, పెదవుల దగ్గర రక్తంలో క్లాట్లు, లేక గాయాలు కావడం లాంటి అనేక కారణాల వల్ల పెదవులు ముదురు రంగుల్లోకి మారతాయి. అయితే వీటిని సహజంగా గులాబీ రంగులో ఉంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
చిన్న బీట్ రూట్ ముక్కను తీసుకుని దాని నుంచి రసాన్ని తీయాలి. దాన్ని చేతి వేళ్లతో పెదవులకు చిన్నగా మర్దన చేయాలి. పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత నీటితో కడుక్కోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల ఫలితం తొందరగా కనిపిస్తుంది. అలాగూ గులాబీ రేకులకు కొంచెం పాలను కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని పావుగంట సేపు పెదవులకు మాస్క్‌లా వేసి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. పాలు, గులాబీ రేకులు రెండూ పెదవులను(lips) తేమగా ఉంచేలా చేస్తాయి. అందువల్ల వాటికి సహజంగా రంగు, నిగారింపు వస్తుంది.
తేనె చర్మాన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. అందుకనే తేనెతో కాస్త చెక్కెర కలిపి స్క్రబ్‌లా రుద్దడం వల్ల పెదవులపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. నిగారింపుగా కనిపిస్తాయి. అలాగే తేనెతో తాజాగా తీసిన కాస్త కలబంద గుజ్జును కలిపి పెదవులకు ప్యాక్‌లా వేయడం వల్లా తొందరగా ఫలితం కనిపిస్తుంది. ఈ ప్యాక్‌ని పెదాలకు పదిహేను నిమిషాలపాటు ఉంచి చన్నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది పెదవులకు సహజమైన గులాబీ రంగుతోపాటు, పొడిబారకుండా చేస్తుంది.