ఏవైనా చిన్న కారణాల వల్ల పుండ్లు, గాయాలు అయి చర్మసమస్యలతో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం మనం చూసే ఉంటాం. యూకేలోని ఓ తొమ్మిదేళ్ల కుర్రాడికి ఒక అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి ఎంత ప్రమాదం అంటే.. తీవ్రమైన దురద, ఆ దురద వల్ల నొప్పి, చర్మం పగిలి రక్తస్రావం అవుతుంది. దీంతో చర్మాన్ని టచ్ చేయలేని పరిస్థితి. దీనిని న్యూరోడెర్మాటిటిస్ అంటారు. ఈ వ్యాధి బాధను భరించలేక కుర్రాడు.. ఇంకా బ్రతకలేను చచ్చిపోతానని అంటుంటే.. కుర్రాడి తల్లిదండ్రులు ఆవేదన. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుడదు. ఎందుకంటే కొడుకు పడుతున్న ఆ బాధను చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు చెందుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. అయితే పుట్టుకతోనే ఈ వ్యాధితో జన్మించిన కుర్రాడికి కొన్నేళ్లు ఈ సమస్య లేదు. తగ్గుతుందని అనుకునేలోపే మళ్లీ ఈ వ్యాధి ఎక్కువైంది.
చర్మం కింద ఎన్నో వందలాది చీమలు పాకితే ఎలా ఉంటుందో అంత నొప్పి ఉంటుంది. నొప్పిని తట్టుకోలేక ఏడుస్తూ రాత్రి నిద్రపోని రోజులు ఎన్నో ఉన్నాయట. ఈ వ్యాధి ఎక్కువగా మెడ, మణికట్టు, ముంజేతులు, కాళ్లు లేదా గజ్జలపై ఎక్కువగా వస్తుంది. ఆందోళన, ఎక్కువగా ఒత్తిడి, నరాల్లో గాయాలు, పురుగు కాట్లు, బిగుతైన దుస్తులు ధరించడం, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నా ఈ వ్యాధి వస్తుందని కూడా అంటున్నారు. కానీ కచ్చితంగా వీటివల్లే వస్తుందనడానికి ఆధారాలు లేవని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్లలో ఎక్కువగా చర్మం పొడిగా మారడం, విపరీతమైన నొప్పి రావడం, జుట్టు ఊడిపోవడం, చర్మంపై రక్తస్రావం కావడం, పసుపు రంగు చీము కారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీర్ఘకాలిక చికిత్స, దురదను తగ్గించే లేపనాలు వాడటం, చర్మం పొడి బారకుండా ఉండేలా మాయిశ్చరైజ్ క్రీముల వాడటం వల్ల ఈ న్యూరోడెర్మాటిటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి:Dengue: డెంగ్యూ నివారణ చిట్కాలు..!