Hormones : సహజంగా హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకోండిలా..
మన జీవ క్రియ సజావుగా జరగాలంటే మనలో హార్మోన్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చక్కగా పని చేయాలి. అవి అలా సహజంగా పని చేయాలంటే మనం రోజూ కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటంటే..
Balance Your Hormones : మన శరీర ఆరోగ్యం మొత్తం హార్మోన్ల పైనే ఆధారపడి ఉంటుంది. మనలో విసుగు, చిరాకు, మూడ్ బాగోకపోవడం లాంటి మానసికమైన విషయాలతోపాటు; శరీరం బరువు పెరగడం, హైపో థైరాయిడిజం, డయాబెటిస్ వంటి శారీరక సమస్యల వరకు అన్నింటికీ మూలం హార్మోన్లే. సమస్యలకే కాదండీ మనకు ఆకలి వేయాలన్నా, తిన్నది అరగాలన్నా, నిద్ర రావాలన్నా… ఇలా ప్రతి జీవ క్రియకు ఓ హార్మోన్ విడుదలవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవి అసరమైనంత విడుదలవ్వాలి. ఎక్కువ విడుదలైనా కష్టమే. తక్కువ విడులైనా కష్టమే. ఇంత ప్రముఖ పాత్ర పోషించే ఈ హార్మోన్ల ఆరోగ్యం సహజంగా బాగుండాలంటే మనం కచ్చితంగా కొన్ని నియమాల్ని పాటించాలి. అవేంటంటే…
రోజు వారీ పనుల్లో కచ్చితంగా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పనులను హడావిడిగా, గజిబిజిగా కాకుండా నిదానంగా చేసుకునేలా ప్రణాళిక వేసుకుని ఆ ప్రకారం పని చేసుకుంటూ వెళ్లాలి. లేదంటే మనలో కోర్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. క్రమంగా అవి దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతాయి. అలాగే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన, ఆరోగ్యకరమైన కొవ్వులున్న ఆహారాన్ని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే ఇన్సులిన్ తగినంత విడుదలవుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కణజాలంలో ఎక్కువగా నిల్వ ఉండవు. తక్షణమే శక్తిగా మారే అవకాశాలుంటాయి. వీటితోపాటు సరైన శారీరక శ్రమ కూడా తోడైనప్పుడు మనలోని హార్మోన్లు క్రమబద్ధంగా విడుదల అవుతాయి.
రోజూ ఆరేడు గంటల పాటు నాణ్యమైన నిద్రను కలిగి ఉండాలి. తక్కువగా నిద్ర పోవడం వల్ల చాలా హార్మోన్లు(Hormones) ఇన్ బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్సులిన్, కోర్టిసోల్, లెప్టిన్, గ్రేలిన్, హెజీహెచ్ లాంటి హార్మోన్లు నిద్రతో సంబంధం కలిగి ఉంటాయి. 14 మంది ఆరోగ్యకరమైన యువకులపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. ఐదు రోజుల పాటు వారు తక్కువగా నిద్రపోయే సరికి వారిలో 25శాతం వరకు ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కావడం మానేసింది.
అలాగే పేగుల్లో దాదాపుగా 100 ట్రిలియన్ మంచి బ్యాక్టీరియా ఉంటాయని చెబుతారు. ఇవి మన పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. ఇవి తిన్న ఆహారాన్ని అరిగించుకునే క్రమంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తినీ ప్రేరేపిస్తాయి. అందుకనే కడుపులోని మంచి బ్యాక్టీరియాలను కాపాడుకోవాలి. అందుకు పెరుగు, పులిసిన పిండితో చేసుకునే దోశల్లాంటి వాటిని తింటూ ఉండాలి. ఎక్కువగా యాంటీ బయోటిక్ మందులను వాడకూడదు. చక్కెరలను తక్కువగా తీసుకోవాలి.