Balance Your Hormones : సహజంగా హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకోండిలా..
ఇటీవల కాలంలో హర్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ అనేది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. మన రోజువారీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని అదుపు చేసుకోవచ్చు. అదెలాగంటే...
మన శరీర ఆరోగ్యం మొత్తం హార్మోన్ల పైనే ఆధారపడి ఉంటుంది. మనలో విసుగు, చిరాకు, మూడ్ బాగోకపోవడం లాంటి మానసికమైన విషయాలతోపాటు; శరీరం బరువు పెరగడం, హైపో థైరాయిడిజం, డయాబెటిస్ వంటి శారీరక సమస్యల వరకు అన్నింటికీ మూలం హార్మోన్లే(Hormones). ఇవి ఎక్కువ విడుదలైనా కష్టమే. తక్కువ విడులైనా కష్టమే. ఇంత ప్రముఖ పాత్ర పోషించే ఈ హార్మోన్లు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలంటే.మనం కచ్చితంగా కొన్ని నియమాల్ని పాటించాలి.
కచ్చితంగా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పనులను హడావిడిగా, గజిబిజిగా కాకుండా నిదానంగా చేసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి. లేదంటే మనలో కోర్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. క్రమంగా అవి దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతాయి. రోజూ ఆరేడు గంటల పాటు నాణ్యమైన నిద్రను పొందాలి. తక్కువగా నిద్ర పోవడం వల్ల చాలా హార్మోన్లు ఇన్‌బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్సులిన్, కోర్టిసోల్, లెప్టిన్, గ్రేలిన్, హెజీహెచ్ లాంటి హార్మోన్లు నిద్రతో సంబంధం కలిగి ఉంటాయి.
మన పేగుల్లో దాదాపుగా 100 ట్రిలియన్ మంచి బ్యాక్టీరియా ఉంటాయని చెబుతారు. ఇవి మన పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. ఇవి తిన్న ఆహారాన్ని అరిగించుకునే క్రమంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తినీ ప్రేరేపిస్తాయి. అందుకనే కడుపులోని మంచి బ్యాక్టీరియాలను కాపాడుకోవాలి. అందుకు పెరుగు, పులిసిన పిండితో చేసుకునే దోశల్లాంటి వాటిని తింటూ ఉండాలి. మంచి కొవ్వులున్న ఆహారాలను తినాలి. ఎక్కువగా యాంటీ బయోటిక్ మందులను వాడకూడదు. చక్కెరలను తక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు మనకు హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్(hormonal imbalance) తలెత్తే అవకాశాలు చాలామటుకు తగ్గిపోతాయి.