Banana Leaves : అరిటాకులో భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా!
భారతీయ ఇళ్లల్లో అనాదిగా అరటాకుల్లో భోజనం చేసే సంప్రదాయం ఉంది. దీనిలో ఆహారం తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం, పర్యావరణానికీ మేలు. దీని వల్ల ప్రయోజనాలు ఏమిటంటే...
Eating On Banana Leaves benefits : మన జీవన విధానంలో నయా మార్పులు ఎన్నో వచ్చాయి. అయినప్పటికీ చాలా మంది పండగలు, వేడుకలకు అరటాకుల్లోనే భోజనం పెడుతుంటారు. వాటిల్లో తినేందుకు ఇష్టపడుతుంటారు. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఏదో ఒక రకమైన తృప్తిగా, ఆనందంగా ఉంటుందని అనుకుంటారు. నిజానికి దీనిలో భోజనం చేయడం వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
అరిటాకుకు(Banana Leaf) సహజంగా మంచి సువాసన ఉంటుంది. దీనిలో వేడి వేడి ఆహారాన్ని పెట్టే సరికి అది ఆహారానికీ పట్టకుని పదార్థం రుచి మరింత పెరిగినట్లుగా అనిపిస్తుంది. పైగా దీని నుంచి ఎలాంటి రసాయనిక పదార్థాలూ విడుదల కావు. కాబట్టి ఇది భోజనానికి ఒక భద్రమైన ప్లేట్ అని చెప్పవచ్చు. అయితే వీటిలో భోజనం చేసే ముందు ఒకసారి వీటిని నీటితో కడగడం అనేది తప్పనిసరిగా చేయాలి. గాలి కాలుష్యం వల్ల కొన్ని సార్లు ఈ ఆకులపై దుమ్ము రేణువులు ఒక పొరలా పేరుకుపోయి ఉంటాయి. వాటిని నీటితో కడుగుకుంటే చాలు. ఆకు శుభ్రం అవుతుంది. భోజనం రుచి పెరుగుతుంది. తిన్నాక మనకు తృప్తిగా ఉంటుంది. దీనిలో అన్నం తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఈ ఆకులో ఉండే పాలీఫెనాళ్లు పొట్టలో జీవ రసాలను తగిన స్థాయిలో విడుదలయ్యేలా చూస్తాయి. అలాగే తిన్న ఆహారంలోని పోషకాలు మెరుగ్గా శరీరానికి అందడంలో సహకరిస్తాయి.
అరిటాకులో(Banana Leaf) సహజంగానే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దానిలో పెట్టుకున్న ఆహారంలో ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నట్లయితే అవి సహజంగా తొలగిపోతాయి. అందువల్ల ఆహార సంబంధంగా వచ్చే అనేక వ్యాధులు మనకు రాకుండా ఉంటాయి. అలాగే వీటిలో పాలీఫినాళ్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ తదితర పోషకాలు ఉంటాయి. మనం అన్నాన్ని దానిలో పెట్టుకుని తిన్నప్పుడు ఇవన్నీ ఆహారంలోకి బదిలీ అవుతాయి. దీని వల్ల ఆహారంలో పోషకాలు మరింత వృద్ధి చెంది మన శరీరంలోకి వెళతాయి. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా అరిటాకులో భోజనం చేయడం వల్ల పర్యావరణానికీ మనం మంచి చేసిన వాళ్లం అవుతాం. మట్టిలో పడేస్తే తొందరగా డీ కంపోజ్ అయిపోతాయి. తద్వారా అక్కడ మట్టి మరింత సారవంతం అవుతుంది.