Gray Hair : ఇదివరకటి కాలంలో ముసలివాళ్లయ్యాక చాలా మందికి జుట్టు తెల్లబడుతూ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం వయసుతో సంబంధం లేదు. 20ల్లో, 30ల్లో ఉన్నవారికి సైతం జుట్టు తెల్లబడటం మొదలవుతోంది. అయితే చిన్న వయసులోనే ఎందుకు ఇలా జరుగుతుంది. దీని వెనకున్న కారణాలేంటి అనేది తెలుసుకుంటే వాటిని సరిచేసుకునే అవకాశమూ ఉంటుంది.
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి(PREMATURE GRAYING) ప్రధాన కారణం మన శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం తగ్గిపోవడమే. వయసు పెరిగే కొద్దీ ఇది తగ్గడం సహజం. కానీ చిన్న వయసులోనే తగ్గిపోవడానికి అనేకానేక కారణాలు ఉన్నాయి. వంశపారంపర్యంగా రావడం ఒక కారణమైతే మితిమీరిన మద్యపానం, ధూమపానం వల్లా శరీరం ఆక్సీకరణ ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా జుట్టు తెల్లబడే అవకాశాలు ఉంటాయి.
అలాగే విటమిన్ బీ12 లోపం, అనీమియా, థైరాయిడ్, ఒత్తిడి వంటి సమస్యలతో ఉన్న వారికీ జుట్టు నెరిసిపోవచ్చు. జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ నిర్వహించిన ఓ అధ్యయనంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. ఒత్తిడి అనేది మెలనోసైట్ల ఉత్పత్తిని తగ్గిస్తుందని ఆ అధ్యయనంలో కనుగొన్నారు. అందువల్లనే చిన్న వయసులోనూ తెల్ల జుట్టు(GRAY HAIR) రావచ్చని పరిశోధకులు తేల్చారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చట. ముఖ్యంగా ప్రొటీన్ లోపం లేకుండా చూసుకోవాలంటున్నారు. అలాగే రాగి, ఐరన్, విటమిన్ B12, బయోటిన్, జింక్, సెలీనియం వంటి పోషకాలను డైట్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఒత్తిడి లేకుండా చూసుకోవాలంటున్నారు.