Excess Oil : నూనె పదార్థాల్ని ఎక్కువ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త !
కొంత మంది ఎక్కువగా నూనెల్లో వేపించిన, డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే అది ఏ మాత్రమూ మంచి అలవాటు కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నూనెలు మన శరీరానికి కొద్ది మొత్తంలో అవసరం. కానీ కొంత మంది మాత్రం పకోడీలు, బజ్జీలు, పునుగులు, బోండాలు, వడలు లాంటి డీ ఫ్రై చేసినవి, నూనెలో వేపించిన పదార్థాలను తినడానికే ఇష్టపడుతుంటారు. ఇలా రోజూ ఎక్కువ మొత్తంలో నూనెలను(Excess Oil) లోపలికి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి(Health) ఇబ్బందులు తప్పవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చెబుతోంది.
ఎక్కువ మొత్తంలో నూనెల్ని తిన్నప్పుడు శరీరంలో ఎక్కువగా కొవ్వులు నిల్వ అవుతాయి. ధమనుల గోడలలో జమ అవుతాయి. ఇవి రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. రక్తానికి మొత్తంగా అడ్డుపడతాయి. గుండె దగ్గర ధమనుల్లో గనుక ఇలా రక్తం బ్లాక్ అయిపోతే గుండె పోటు వస్తుంది. శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వులు పెరుగుతాయి. అందువల్ల స్ట్రోక్, రొమ్ము/అండాశయ క్యాన్సర్లు, మధుమేహం, రక్త పోటు, కీళ్ల నొప్పులు.. లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని FSSAI చెబుతోంది. మరి ఇలా అదనంగా నూనెల్ని లోపలికి తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయొచ్చనే దానిపైనా కొన్ని సిఫార్సులు చేస్తోంది. అవేంటంటే?
ఆహారాల్ని వేపించడానికి బదులుగా స్టీమ్ చేయడం, బేక్ చేసుకుని తినడం లాంటివి చేసేందుకు ప్రయత్నించండి. ఆహారాల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి బదులుగా బార్బిక్యూ పెట్టుకుని గ్రిల్ చేసుకోండి. లేకపోతే ఎయిర్ ఫ్రయర్లను ఉపయోగించడం ద్వారా కాస్త నూనెతోనే ఆహారాలు ఫ్రై అయిపోతాయి. ఏదో ఒక రకమైన నూనెనే ఎప్పుడూ వాడకూడదు. అన్ని నూనెల్లోని పోషకాలు శరీరానికి అవసరం ఉంటాయి కాబట్టి ప్రొద్దు తిరుగుడు, రైస్ బ్రాన్, వేరు శెనగ, ఆవ, కొబ్బరి, నువ్వుల నూనె(Oil) తదితరాల్ని మార్చి మార్చి వాడుతూ ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. రోజూ కూరల్లో నూనెను వేసేప్పుడు ఎంత పడుతుందో అంత పోసేయడం అన్నట్లు చేయకూడదు. ఒక స్పూన్ని కొలతగా పెట్టుకుని రోజూ అంత మోతాదులో మాత్రమే నూనెను వేయడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల మనం రోజూ ఎంత వాడుతున్నాం అనేది తెలుస్తూ ఉంటుంది. ఆహారాలు తినేప్పుడు రోజులో ఎక్కువ భాగం సహజమైన వాటిని తినేందుకు ఆసక్తి చూపాలి. వండటం జోలికి వెళ్లకూడదనే నియమం పెట్టుకోవాలి. అప్పుడు మన రోజు వారీ నూనె వాడకం పెద్ద మొత్తంలో తగ్గిపోతుంది.