Dark Chocolate: రోజుకో చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తింటే ఎన్ని ప్రయోజనాలో
చాలా మంది పెద్ద వారు కూడా చాక్లెట్లను భలే ఇష్టంగా తినేస్తుంటారు. అయితే మిగిలిన చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్ని రోజుకో ముక్క తిని చూడండి. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటంటే...
dark chocolate benefits : పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాక్లెట్లంటా చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే సాధారణ చాక్లెట్ల కంటే షుగర్ తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయం పలు అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. మిగిలిన వాటితో పోలిస్తే డార్క్ చాక్లెట్లు(Dark Chocolates) కాస్త ముదురు రంగులో ఉండి చిరు చేదుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడితో ఉన్న వారు, ఎక్కువ పనులతో సతమతం అవుతున్న వారు డార్క్ చాక్లెట్లను తినడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి. దీంతో మరింత ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
డార్క్ చాక్లెట్ని రోజూ తగు మొత్తంలో తినడం వల్ల అది మెదడు పని తీరు మీదా ప్రభావం చూపిస్తుంది. మెదడుకు సవ్యంగా రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. అలాగే మన రక్తంలో ఉండే చెడు కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది. దీనిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని రకాల క్యాన్సర్లు మన దరి చేరకుండా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాల వల్ల వాపులు తగ్గుతాయి. నొప్పులు రాకుండా ఉంటాయి.