తెలుగు నెలల్లో కొన్ని నెలలకు ప్రత్యేకత ఉంది. అందులో చాంద్రమానం ప్రకారంగా చూస్తే పడకొండవ మాసం అయిన మాఘమాసానికి అపార విశిష్టత ఉంది. చంద్రుడు మఖ నక్షత్రంలో ఏర్పడే మాసం కనుక దీనిని మాఘమాసం అన్నారు. అఘము అంటే పాపం అని అర్థం వస్తుంది. మాఘమాసం అంటే పాపాలను నశింపజేసేదిగా పురణాలను చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ నెల సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. హిందూ సంప్రదాయం ప్రకారంగా చూస్తే కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో స్నానానికి అంతే ప్రాముఖ్యత అనేది ఉంది.
మాఘమాసంలో చేసే నదీ స్నానం, శ్రీమన్నారాయణుని పూజ, చేసేదానం కోటి క్రతువుల ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో నదీస్నానం సర్వపాపాలను హరించి వేస్తుంది. ఈ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేయాలి. నదుల వద్ద స్నానం చేయలేనివారు ఇంట్లో స్నానం చేసే సమయంలోనైనా గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలచుకుంటూ స్నానం ఆచరించవచ్చు. సూర్యభగవానుడిని పూజించడం ద్వారా అనుకున్నవన్నీ సవ్యంగా సాగుతాయి.