Uttarpradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఏడాది కాలంగా ఇంట్లోనే ఉంచిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు జీవిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దావిడ పేరు పల్లవి, రెండో కూతురు పేరు వైష్విక్. ఉష భర్త రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె చిన్న దుకాణం పెట్టుకుని జీవనోపాధి పొందుతోంది.
గత ఏడాది డిసెంబర్ 8న ఉష అనారోగ్యంతో మృతి చెందింది. దీన్ని జీర్ణించుకోలేని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎవరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. మిర్జాపూర్లో ఉంటున్న ధర్మేంద్ర కుమార్ బుధవారం తన సోదరి ఉషా త్రిపాఠిని చూసేందుకు వచ్చాడు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో ధర్మేంద్రకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఓ గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మానసిక పరిస్థితి బాగాలేదని విచారణలో తేలింది. పల్లవి, వైష్విక్లను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.