టెర్రరిస్టుల వాంటెడ్ జాబితాలో ఉన్న నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న రియాజ్ అహ్మద్..అలియాస్ అబు ఖాసింను దుండగులు కాల్చిచంపేశారు. ఇతను పలు కుట్రల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని అధికారులు తెలిపారు.
భారత్లో వాంటెడ్ గా ఉన్న ఓ ఉగ్రవాదిని శుక్రవారం పీఓకేలో గుర్తుతెలియని ముష్కరులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు. నిషేధిత లష్కరే తోయిబా(Lashkar e Taiba)కు అనుబంధంగా ఉన్న రియాజ్ అహ్మద్(Riaz Ahmed).. అలియాస్ అబూ ఖాసిం జనవరి 1న జరిగిన ధంగ్రీ ఉగ్రదాడి వెనుక ప్రధాన కుట్రదారుల్లో ఒకరిగా ఉన్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం వెళ్లిన క్రమంలో దుండగులు ఆ టెర్రరిస్టును మట్టుబెట్టారు.
జమ్ముకశ్మీర్(jammu and kashmir)లోని రాజౌరి జిల్లా ధంగ్రీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం ఏడుగురు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. సరిహద్దు ప్రాంతంలో ఓ ప్రముఖ ఉగ్రవాది హతం కావడం ఇది నాలుగోసారి. వాస్తవానికి జమ్మూ ప్రాంతానికి చెందిన అహ్మద్ 1999 నుంచి సరహద్దుకు అవతల ఉంటున్నాడని అధికారిక వర్గాలు తెలిపాయి. జంట సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీలలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడంలో అతను పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. లష్కరే తోయిబా చీఫ్ కమాండర్ సజ్జద్ జాత్ కు అహ్మద్ సన్నిహిత వ్యక్తిగా ఉన్నాడు.