విదేశాల్లో భారతీయులు చాలా మంది జైళ్ల(Jails)లో మగ్గుతున్నారు. ప్రస్తుతం 8,300 మంది భారత ఖైదీలు విదేశాల్లో ఉన్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. అందులో కూడా ముఖ్యంగా యూఏఈ(UAE), సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ప్ దేశాల్లోనే ఎక్కువ మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నట్లు తెలిపింది. విదేశాల్లోని భారత ఖైదీల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వారిని విడిపించేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తోందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు.
విదేశాల్లోని భారత ఖైదీలను విడుదల చేసి, స్వదేశానికి రప్పించేందుకు అక్కడి ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈ(UAE)లోని జైళ్లలో 4,630 మంది భారత ఖైదీలు శిక్షలను అనుభవిస్తున్నారు.
అందులో అత్యధికంగా యూఏఈలో 1,611 మంది, సౌదీలో 1461, ఖతార్లో 690 మంది ఖైదీలు ఉన్నట్టుగా విదేశాంగ శాఖ మంత్రి వెల్లడించారు. అలాగే పొరుగుదేశాలైన నేపాల్లో 1222 మంది, పాక్లో 308, చైనాలో 178, బంగ్లాదేశ్లో 60, శ్రీలంకలో 20 మంది భారత ఖైదీలు మగ్గుతున్నట్లు మంత్రి వీ మురళీ ధరన్ (Minister Murali Dharan) తెలిపారు.