NZB: టి యు పరిధిలో (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రెటెడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చ్ 11 వరకు మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు జరగనున్నాయన్నారు. ఫిబ్రవరి 26, 28, మార్చ్ 2, 4, 6, 9, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.
HYD: రాత్రి కురిసిన భారీ వర్షానికి రాజేంద్రనగర్ బుద్వేల్ రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డు వేయడంలో నిర్లక్ష్యం, పొరపాట్ల కారణంగా గుంతలతో నిండిపోయాయని ప్రజలు వాపోతున్నారు. స్థానికులు, విద్యార్థులు, ప్రయాణికులు వర్షాల వేళ రోడ్డు జాగ్రత్తగా దాటాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షానంతరం ట్రాఫిక్ నియంత్రణకు సవాలు సృష్టిస్తోంది.
JGL: గొల్లపల్లి మండలం బీబీ రాజు పల్లె గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడడంతో లంబడిపల్లెకు చెందిన డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
WNP: హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని వనపర్తి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి విద్యార్థులు ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె. హరిత చెప్పారు. కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, అటవీ అధికారులు, BSNL , ఎయిర్ టెల్, జియో, టీ ఫైబర్ ప్రతినిధులతో సెల్ టవర్ నిర్మాణాలు, ఇంటర్నెట్ సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని అనుమతులు, స్థలాల గుర్తింపు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
KMR: కామారెడ్డి మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కో -ఆప్షన్ పదవులపై పడింది. ప్రస్తుతం ఈ ఎన్నికను కూడా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం కొత్త పాలకవర్గం కొలువదీరిన వెంటనే కో-ఆప్షన్ పదవులను నియమించాల్సి ఉంటుంది. ఇందుకోసం త్వరలోనే నోటిఫికేసన్ జారీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
MDCL: ప్రజలకు నీటి సరఫరా చేసే ముందుగా నాణ్యత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా జలమండలి ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద మేడిపల్లి ప్రాంతంలో సోలార్ క్లోరినేటర్ మీటర్లను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. వీటిని ఓవర్ హెడ్ ట్యాంక్ ఇన్ లెట్, అవుట్ లేట్ పైపులకు అమరిచిన తరువాత రెండుసార్లు నాణ్యత పరీక్షలు చేయనున్నారు.
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని కోటపహాడ్ నర్సరీ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రభుత్వం మొక్కల పెంపకానికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. నర్సరీలోని మొక్కలకు సకాలంలో నీళ్లు పోయకపోవడంతో వేల సంఖ్యలో మొక్కలు ఎండిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంపై మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BHPL: జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ భవనంలో నేటి నుంచి పంచాయతీ సర్పంచులకు మూడో విడత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. మహాముత్తారం, మలహర్, పలిమెల మండలాలకు చెందిన సర్పంచులకు ఈ తుది విడత శిక్షణ 28వ తేదీ వరకు జరుగుతుంది. పంచాయతీ వ్యవస్థ బలోపేతం, అభివృద్ధి పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు.
MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి చేతన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్‌కు ఎంపికైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న చేతన ఎన్ఎంఎంఎస్ పరీక్షకు హాజరైంది. విద్యార్థికి 8, 9 తరగతులతోపాటు, ఇంటర్మీడియట్లో రూ. 1000 స్కాలర్షిప్ లభించనున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు.
KMM: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లను ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్నబియ్యం నిల్వలు, నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిల్వల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బియ్యం రక్షణకు రసాయనాల వినియోగంపై అధికారులకు సూచనలు చేశారు.
MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలోని ఇప్ప లత ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సామాగ్రి కాలిపోయాయి. బాధితుల వివరాల ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్ల బట్టలు, టీవీ, కూలర్, ఫ్యాన్, ఫ్రిజ్, రూ.50వేలు, అర తులం బంగారం, కుమారుడి స్టడీ సర్టిఫికెట్స్ కాలి బూడిద అయ్యాయన్నారు. అధికారులు స్పందించి నిరుపేదలమైన తమకు సాయం చేయాలని వేడుకున్నారు.
HYD: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
MDCL: జిల్లా వ్యాప్తంగా జీరో టీబీ లక్ష్యంగా DTO అధికారిక యంత్రం చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపింది. ఇందులో భాగంగానే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉద్యోగులకు క్షయ, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించినట్లుగా పేర్కొంది. అత్యధిక టెక్నాలజీతో కూడిన ఏఐ ఎక్స్ రే ద్వారా వ్యాధిని సులభంగా గుర్తించడం జరుగుతుందని డాక్టర్ సంధ్య పేర్కొన్నారు.
NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులకు మరింత చేరువగా సేవలందించేందుకు కొత్తగా 64 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి. (NLG-42, SRPT-44,YDD-21). కొత్త సంఘాల ఏర్పాటులో భాగంగా పాత సొసైటీల పరిధిలోని కొత్త గ్రామాలను విడదీసి కొత్త వాటిల్లో విలీనం చేయనున్నారు.