MLG: మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి శివారులోని కాలువలో పడి ఒడిశాకు చెందిన మిఠాలాల్ టండి (55) మృతి చెందాడు. ఇటుక బట్టీ పనుల కోసం ములుగుకు వచ్చిన ఆయన శనివారం వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం సాయంత్రం కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
WNP: మస్తిపురం ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై స్వాతి ఆదివారం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచిస్తూ, అందరితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
GDWL: జిల్లాలో విషాదం నెలకొంది. ఎర్రవల్లి మండలం బొచ్చు వెంగనపల్లెకు చెందిన అంజలి అనే చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందింది. హైదరాబాద్‌లో చదువుతున్న అంజలి, తల్లితో కలిసి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
NLG: చండూరులోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఆలయంలో హోమం, బలిహరణ, భేరి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మండపంలో పురోహితులు హరికిషన్ శర్మ, ప్రవీణ్ శర్మల ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.భక్తులు ఉత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు.
WGL: TG Ed.CET-2026 నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. WGLలోని KUలో ఎడ్‌సెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షా షెడ్యూల్‌తో పాటు ముఖ్యమైన తేదీల వివరాలను ప్రకటించనున్నారు. బీ.ఎడ్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు సోమవారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో కీలక సమాచారం పొందవచ్చు అన్నారు.
NZB: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్లను ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు తమ డివిజన్ తో పాటు NZB నగర అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
VKB: మైనారిటీ యువత ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం సబ్సిడీ స్కూటర్ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా అధికారి ఎస్. రాజేశ్వరి తెలిపారు. రూ. 1.50 లక్షల విలువైన వాహనంపై రూ. 1.20 లక్షలు సబ్సిడీగా అందించి, లబ్ధిదారుడు రూ. 30 వేలే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. 21-40 సంవత్సరాల వయస్సు, పదో తరగతి ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తప్పనిసరి అన్నారు.
MDCL: బీఆర్ఎస్‌కు చెందిన కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్ కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో చేరాడు. ఎమ్మెల్యే కెపి వివేకానందకు బాబాయ్ కావడంతో ఈ చేరిక స్థానికంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.
NRPT: బీసీల ఐక్యతకు కమ్యూనిటీ భవనాలు ఎంతో కీలకమని రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి మత్స్య యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం మక్తల్ సిద్ధాంతిలో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం సర్కారు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
KMM: చింతకాని మండలం చిన్నమండవ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ పర్చ రామచంద్రరావు ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్‌ను కోరారు. ఏపీ వత్సవాయి మండలం పోలంపల్లి ప్రాంతం నుంచి ఖమ్మంకు బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోతాయని, ముఖ్యంగా ఇంటర్మీడియట్, పదవ తరగతి విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభం కానున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి యధావిధిగా పంటల కొనుగోలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధర ఉండాలని అధికారులు సూచించారు.
ADB: కడెం మండలం దోస్త్ నగర్ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆదిలాబాద్ బొక్కలగూడకు చెందిన సయ్యద్ నసీరుద్దీన్‌గా గుర్తించారు. అతను మంచిర్యాలలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ నిర్మల్‌లో నివాసం ఉంటున్నారు.
HYD: అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్‌సుఖ్ నగర్‌లోని ఆర్టీసీ హైదరాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. మార్చి 1వ తేదీన రాత్రి 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. తిరిగి నాలుగవ తేదీన బస్సు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. భక్తులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు.
MDK: టేక్మాల్ మండలం బోడగట్టు సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కమ్మరికత్త, సూరంపల్లి, వేల్పూగొండ తదితర గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ ఉదయ్ భాస్కర్, ఏడీఈ వెంకటేశ్వరరావు తెలిపారు వినియోగదారులు గమనించి సహాకరించాలని కోరారు.
KNR: కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆశలకు గండి పడినట్లు తెలుస్తోంది. ఆదివారం మేయర్ శ్రీనివాస్ తన ఛాంబర్లోకి అడుగుపెట్టగా, అదే సమయంలో డిప్యూటీ మేయర్‌కు కూడా ఛాంబర్ కేటాయిస్తారని భావించినా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకోలేదు. బీజేపీయేతర పార్టీల నాయకుల ఫిర్యాదు మేరకు ఛాంబర్ అలాట్ నిలిచిపోయింది.