NZB: వేల్పూర్ మండలం పచ్చల నడుకుడలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు టక్కరి గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్ కిషన్ చేతుల మీదుగా లబ్ధిదారులు ఆలీ నరహరికి ₹ 26,000, ముసుకు నవీన్‌కు ₹ 9,000 విలువైన చెక్కులను అందజేశారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
NRPT: దామరగిద్ద మండలంలోని అంబా భవానీ ఆలయంలో భవానీ మాత విగ్రహ 25వ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించబడింది. అమ్మవారికి మంగళహారతులు, బండారు, చందనం, అభిషేక పూజలు చేశారు. ప్రభురాజ్, రఘునాథ్ రావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం అందజేశారు. ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్, కూచిరాజుపల్లి, గంగాపురి స్టేజీల వద్ద రాత్రి సమయంలో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలిపివేయాలని డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్‌కు బీజేపీ నాయకుడు బోయిని నారాయణ వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లి తిరిగివచ్చే ప్రయాణికులు బస్సులు ఆగక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్‌ను కాంగ్రెస్ పార్టీ లక్షేట్టిపేట మండల నాయకులు కలిశారు. మంచిర్యాల మేయర్‌గా ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట మండల, పట్టణ నాయకులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
BHPL: మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ ఛైర్మన్‌గా అంబాల శ్రీనివాస్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై, మాట్లాడారు. మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. అనంతరం నూతన ఛైర్మన్ సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు.
KNR: శంకరపట్నం మండలంలో 8402 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ తెలిపారు. 4135 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, రైతులు తమ వ్యవసాయ క్లస్టర్లలో ఏఈవోలతో ఈనెల 28లోగా చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు కేంద్ర ప్రభుత్వ పథకాల అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు.
SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ధర్మగుండం పునర్నిర్మాణ పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ పరిశీలించారు. దాతల సహకారంతో జరుగుతున్న ఈ పనులను బ్రహ్మోత్సవాల (జాతర)లోపు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆలయ కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
JN: జిల్లాలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2.73 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి SMAM పథకం కింద ఈ నిధులు మంజూరైనట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. రైతులకు కావలసిన యంత్ర పరికరాలు 50% రాయితో అందిస్తామని,రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని డీడీ రూపంలో సంబంధిత కంపెనీలకు చెల్లించాలని సూచించారు.
NLG: చిట్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్‌గా గుండెబోయిన శ్రీ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ దండు శ్రీనివాస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే వేముల, రాష్ట్ర డైరీ ఛైర్మన్ గుత్తా అమిత్ నూతన పాలకవర్గాన్ని సన్మానించి, అభినందించారు.
HYD మ్యాప్ అధికారికంగా మారిపోయింది. ORR దాటి RRR వరకు అథారిటీ పరిధి విస్తరించింది. 104 మండలాల్లోని 1,355 గ్రామాలు ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చాయి. RRRకి ఇరువైపులా 2 కి.మీ మేర ‘డెవలప్మెంట్ బఫర్’ జోన్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఇక్కడ గ్రామ పంచాయతీ లేఅవుట్లకు అనుమతి ఉండదు. మొత్తం 10,472 చ.కి.మీ పరిధిలో కఠినమైన HMDA నిబంధనలు అమలు కాబోతున్నాయి.
GWDL: నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు ధరూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయానికి గురి చేసిందన్నారు. అలాగే జిల్లాలో రైతుల సమస్య పరిష్కారానికై ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సమావేశంను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి మహిళలు, రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
MHBD: గూడూరు మండలం గండసోములుతండాలో ఆదివారం కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానికుడు బోడ ధన్యకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై బూడిదైపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 2 లక్షల విలువైన ఆస్తి నష్టపోయింది. ప్రభుత్వం బాధితుల ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
NZB: బస్సాపూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఆజీఎస్ కింద మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉపసర్పంచ్ వంశీ పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి నిధులు వెచ్చించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
RR: మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమీర్పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పర్యటనలో సర్పంచ్‌లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 23న ఉదయం 10:30 గంటలకు జిల్లా స్థాయి భౌతిక, రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్ జరగనుంది. ఈ విషయని మెదక్ డివిజన్ అధ్యక్షుడు ఎల్.మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు.