KMR: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. మద్నూర్ కేంద్రానికి అశ్విని అనే విద్యార్థిని నిర్ణీత సమయం కంటే కొంత ఆలస్యంగా చేరుకుంది. అధికారులు నిబంధనల మేరకు ఆమెను లోపలికి అనుమతించకపోవడంతో పరీక్ష రాయలేకపోయింది.విద్యార్థిని కన్నీటి పర్యంతమవుతూ అక్కడి నుంచి వెనుదిరిగింది.
దేవరకొండ: పట్టణంలోని 3వ వార్డు కౌన్సిలర్ అంకురి సుమలత వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వార్డులో పేరుకుపోయిన మురికి కాలువలను స్వయంగా పర్యవేక్షించి పూడిక తీయించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల వ్యాప్తి చెందకుండా మురుగు నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఇన్‌ఛార్జి DMHO డా.రవీందర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై పలు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే సాధారణ కాన్పులే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. చిన్నపిల్లలకు టీకాల వివరాలను ఆన్‌లైన్ చేయాలన్నారు.
BDK: మణుగూరు కట్టు మల్లారం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పోడు భూమి సమస్యపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫారెస్ట్ అధికారులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి సమస్యను సమగ్రంగా చర్చించారు. గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
NRPT: కోస్గి మండలంలోని ముశ్రీఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు ఉపాధ్యాయులతో వివరించారు. పాఠశాల GHMగా పవన్, కలెక్టర్‌గా శివరాం, విద్యాశాఖ మంత్రి ముస్థాక్, వివరించినట్లు పాఠశాల GHM శేఖరయ్య తెలిపారు. ఉత్తమ విద్యా బోధన చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తోటి విద్యార్థులకు విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలను బోధించారు.
ASF: పెంచికల్ పేట్ మండలం ఎలుకపల్లికి చెందిన నాగేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జేసీబీ తవ్విన మట్టి దిబ్బల సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న SI అనిల్ కుమార్ బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
JGL: ధర్మపురి మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్‌గా వేముల నాగలక్ష్మి పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రజల సహకారంతో పారదర్శక పాలన అందిస్తానని ఛైర్ పర్సన్ హామీ ఇచ్చారు.
SDPT: పట్టణంలోని మోడల్ రైతు బజార్‌ను హరీశ్ రావు రాత్రి సందర్శించారు. రైతులతో ఆత్మీయంగా మాట్లాడుతూ.. అవ్వా వ్యాపారం ఎట్లుంది అని మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్‌లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకుని రైతులకు ఇబ్బందులు కలకుండా చూడాలని, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు.
SRPT: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ బుధవారం సూర్యాపేట పట్టణంలోని నారాయణ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి,నిర్వహణ విధానాలను సమీక్షించారు.పరీక్ష కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ప్రశ్నాపత్రాల భద్రపరిచే విధానం,హాల్ సూపరింటెండెంట్లు,ఇన్విజిలేటర్ల విధులు వంటి అంశాలను పరిశీలించారు.
SDPT: హుస్నాబాద్ నగర శివారులో బులోరా వాహనం ఢీకొని పట్టణానికి చెందిన కేశవని సంపత్ (55) మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని సైకిల్ పై ఇంటికి తిరిగి వస్తుండగా అతివేగంగా వస్తున్న బులోరా వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన అతన్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
MLG: మావోయిస్టు పార్టీలో 28 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో పనిచేసిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లొంగిపోయిన విషయం తెలిసిందే. 2019లో తెలంగాణ కమిటీ సైనిక వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితుడై, గత ఏడాది నుంచి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు. పలు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు. ‘పోరుకన్నా ఊరు మిన్న’ పిలుపు ఫలితమిచ్చిందని అధికారులు తెలిపారు.
KNR: ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మున్సిపల్ ఛైర్‌పర్సన్ సువాసిని అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాములు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
MNCL: బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ జాడి మహేశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభను నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ఆరోగ్యం, పచ్చదనం పెంపొందించడం, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం వంటి అంశాలపై చర్చించారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని సర్పంచ్ కోరారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీలిమిటేషన్ ప్రక్రియ పక్కా అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జనాభా లెక్కలు, కులగణన పూర్తి కావడంతో మున్సిపల్ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం 12 స్థానాలు ఉండగా, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం మరో 3 సీట్లు జత కలిసి 15 సీట్లు అవుతాయని అంచనా. ఇందులో 5 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి.
JN: గ్రంథాలయాలు ప్రగతికి నిలయాలు అని నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అన్నారు. గ్రామంలోని గ్రంథాలయాన్ని స్థానిక నేతలతో కలిసి సర్పంచ్ పరిశీలించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అన్నారు. ఉపసర్పంచ్ కావ్య ప్రభాకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.