GDWL: ఇంటర్మీడియట్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాలను నిబంధనల ప్రకారం సురక్షితంగా తపాలా కార్యాలయానికి చేరవేయాలని అధికారులకు సూచించారు.
SRPT: నడిగూడెంలోని గురుకుల కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 16 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో వోకేషనల్ కోర్సు నుంచి 5 మంది, జనరల్ నుంచి 11 మంది ఉన్నట్లు పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. ఎస్సై ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆమె పేర్కొన్నారు.
JGL: మల్యాల మండలం నూకపెల్లి ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును మార్చి10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఆదిత్య తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, వీరికి ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సమితి డిమాండ్ చేసింది. సోమవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొట్ల సాగర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్య సంస్థలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
RR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల నూతన రాష్ట్ర కార్యవర్గంలో షాద్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల నూతన రాష్ట్రస్థాయి కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కరుణాకర్ ఎంపిక కావడం విశేషం. కరుణాకర్ ఎంపికపట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
KMR: గాంధారీ మండలంలోని సిహెచ్సిలో గరివినీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధారి పరిసర ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు ‘అమ్మఒడి’ కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం గర్భిణీలకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
KMR: బిక్కనూరులోని ప్రసిద్ధ సిద్ధరామేశ్వర ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా రేపు మూసివేస్తున్నట్లు EO శ్రీధర్ తెలిపారు. ఉ.8 గంటల నుంచి బుధవారం ఉ.6 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి అనంతరం పూజలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఈమార్పును గమనించి సహకరించాలన్నారు.
KMR: బిచ్కుందలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 97.91% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ జరిగిన మ్యాథ్స్, బోటనీ తదితర పరీక్షలకు సంబంధించి సెట్-బీ పరీక్ష పత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 383 మంది విద్యార్థులకు గాను 375 మంది విద్యార్థులు హాజరు కాగా, 8 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
ASF: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు మాజీ స్పీకర్, స్వర్గీయ నేత దుద్దిళ్ల శ్రీపాదరావు వన్నె తెచ్చారని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం ఆయన జయంతి సందర్భంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు న్యాయవాదిగా ప్రజలకు మంచి సేవలు అందించారని పేర్కొన్నారు.
SRPT: మోతె మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి వార్ల కల్యాణ మహోత్సవం ఇవాళ భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.
NLG: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీసీసీ (TCC) డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ ఫలితాల్లో నల్గొండలోని జేఆర్ డ్రాయింగ్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. శాంభవి, శ్రీవల్లి, ప్రవస్థి, మేఘన, చందన సహా పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ జానయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించారు.
NLG: హోలీ పండుగ రోజు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’ నిరంతరం పహారా కాస్తాయని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.
SRPT: మోతె మండలం రాఘవాపురం గ్రామంలో సోమవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్ది భాస్కర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రేణుక, ఉపసర్పంచ్ గోపయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
NGKL: బల్మూర్ మండలం తుమ్మన్‌పేటలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల సందడి కొనసాగుతోంది. సోమవారం తమ ఫామ్ హౌస్‌లో ఈ నూతన దంపతులు తులసి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ వేడుకల కోసం సుమారు 400 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
MBNR: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారానే పేదల సొంతింటి కల నిజమవుతోందని నగర డిప్యూటీ మేయర్ మరేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. 11వ డివిజన్ బండమీదిపల్లిలో కుర్వ శ్రీను-సుజాత దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ పథకం నిరుపేదలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తోందని పేర్కొన్నారు.