KMM: ఖమ్మంలో రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన 15 మందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు. జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ట్రెసా ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
NLG: గట్టుప్పల్ మండలం తేరట్ పల్లిలో శ్రీ మార్కండేయస్వామి 81వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
NLG: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడికీ ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు.
BDK: రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, వైద్య ఖర్చులు భరించలేక ఆయన మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
MHBD: రాష్ట్రంలో వచ్చేది BRS ప్రభుత్వమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, మహిళల సమస్యలు వదిలిపెట్టి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కమిషన్ల కోసం కొట్లాడుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్, వైస్ చైర్మన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం సరికాదన్నారు.
SRD: జహీరాబాద్ నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఖాళీగా ఉన్న 500 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నట్లు డీఆర్డీవో జ్యోతి తెలిపారు. అభ్యర్థులు ధృవీకరణ పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SRCL: గంభీరావుపేట మండల కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈనెల 26న మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ వి.విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని టాస్క్ కో ఆర్డినేటర్ జె.శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
NGKL: నల్లమల్ల అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన నక్షత్రపు తాబేలు శుక్రవారం వెలుగుచూసింది. అడవిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీడీఏ మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వస్తుండగా రోడ్డుపై భారీ పరిమాణంలో ఉన్న ఈ తాబేలును గుర్తించారు.
JGL: జగిత్యాల-కరీంనగర్ రోడ్డులోని నర్సింగాపూర్‌లో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో 3D ప్రింటింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. PMKVY 4.0 స్కీమ్‌లో భాగంగా సోమవారం నుంచి కోర్సు ప్రారంభమవుతుందని, ఈ కోర్సు 3 నెలలపాటు ఉంటుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KMM: ఖమ్మంలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి పరిపాలనా అనుమతి లభించింది. ఈ నిర్మాణానికి రూ.4.50 కోట్ల నిధులను పబ్లిక్ వర్క్స్- ఆఫీస్ బిల్డింగ్స్ ఖాతా నుంచి విడుదల చేశారు. ఈ మేరకు ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
SRPT: కోదాడ పట్టణంలో కుటుంబ సమస్యలతో కుక్కల కృష్ణ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలో గణేష్ నగర్‌లో తన అద్దె నివాసంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ వెల్లడించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
NZB: డిచ్‌పల్లి మండలం ధర్మారంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల (బాలుర) పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి గోవింద్ సింగ్ జాతీయ స్థాయిలో జరుగనున్న సబ్ జూనియర్ వాలీబాల్ (అండర్-16) పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్స్ దివ్యరాణి, లక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్వాతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
NZB: జిల్లా నుంచి రాష్ట్ర ఛైర్మన్లుగా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశమిస్తారా? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. కాగా, జిల్లా నుంచి ఈరవత్రి అనిల్ కుమార్-మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మానాల మోహన్ రెడ్డి-సహకార యూనియన్, అన్వేష్ రెడ్డి-విత్తనాభివృద్ధి సంస్థ, తాహేర్ బిన్ హమ్దన్-ఉర్దూ అకాడమీకి రాష్ట్ర ఛైర్మన్లుగా కొనసాగుతున్నరు.
WNP: త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవిందస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వనపర్తి అదనపు కలెక్టర్ కీమ్యా నాయకు వినతిపత్రం అందజేశారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే స్థానిక సంస్థల్లో సముచిత రిజర్వేషన్లు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
GDWL: మహిళా విద్య, రాజ్యాంగ అవగాహనతోనే ఉన్నతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలో జన విజ్ఞాన వేదిక (JUU) ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆడపిల్లల చదువు ఆవశ్యకత’ పోస్టర్, ‘బాలల కోసం భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.