GNTR: చేబ్రోలు మండల పరిధిలో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు MLA ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. మృతి చెందిన నలుగురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల చొప్పున, మొత్తం రూ. 6 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
దేశవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థుల నుంచి యువ విజ్ఞాన కార్యక్రమానికి (యువిక) ఇస్రో దరఖాస్తులు స్వీకరిస్తోంది. వైజ్ఞానిక శాస్త్రంతో పాటు అంతరిక్ష పరిజ్ఞానంపై క్విజ్ రూపంలో పిల్లలను అధికారులు పరీక్షిస్తారు. దీనికి ఈనెల 27 నుంచి మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2026 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
NGKL: నల్లమల్ల అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన నక్షత్రపు తాబేలు శుక్రవారం వెలుగుచూసింది. అడవిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీడీఏ మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వస్తుండగా రోడ్డుపై భారీ పరిమాణంలో ఉన్న ఈ తాబేలును గుర్తించారు.
TPT: తొట్టంబేడు 2 టౌన్ పరిధి చెన్నై రోడ్డులోని MGM ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమె ఆచూకీ తెలిసినవారు శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్‌కు సంప్రదించాలని సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.
AKP: ఎస్ రాయవరం మండలం తిమ్మాపురంలో ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. నక్కపల్లి మండలానికి చెందిన కొల్లి సురేంద్ర(19) ద్విచక్ర వాహనంపై వెళుతూ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు.
JGL: జగిత్యాల-కరీంనగర్ రోడ్డులోని నర్సింగాపూర్‌లో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో 3D ప్రింటింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. PMKVY 4.0 స్కీమ్‌లో భాగంగా సోమవారం నుంచి కోర్సు ప్రారంభమవుతుందని, ఈ కోర్సు 3 నెలలపాటు ఉంటుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KMM: ఖమ్మంలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి పరిపాలనా అనుమతి లభించింది. ఈ నిర్మాణానికి రూ.4.50 కోట్ల నిధులను పబ్లిక్ వర్క్స్- ఆఫీస్ బిల్డింగ్స్ ఖాతా నుంచి విడుదల చేశారు. ఈ మేరకు ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
SRPT: కోదాడ పట్టణంలో కుటుంబ సమస్యలతో కుక్కల కృష్ణ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలో గణేష్ నగర్‌లో తన అద్దె నివాసంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ వెల్లడించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
TG: రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 22, 23, 24 తేదీల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు చెప్పింది. శుక్రవారం భద్రాచలంలో 1.1డిగ్రీలు పెరిగి 36.2డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 1.6 డిగ్రీలు పెరిగి 35.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
PLD: నాగార్జునసాగర్ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు శుక్రవారం రెవెన్యూ అధికారులతో భేటీ అయ్యారు. పశువేముల, చింతలతండా,నాగులవరం గ్రామాల్లో సుమారు 800 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.భూముల వర్గీకరణ, ధరలపై తహశీల్దారుతో చర్చించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.
KDP: కడప రైల్వే స్టేషన్ సమీపంలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కాచిగూడ నుంచి తిరుచానూరు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న బిటెక్ విద్యార్థి సైపుల్లా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి కడపకు వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
KRNL: సోలార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ఇక నుంచి 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. నమోదైన ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా సోలార్ విక్రేతలు పరిష్కరిస్తారని అన్నారు.
NZB: డిచ్‌పల్లి మండలం ధర్మారంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల (బాలుర) పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి గోవింద్ సింగ్ జాతీయ స్థాయిలో జరుగనున్న సబ్ జూనియర్ వాలీబాల్ (అండర్-16) పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్స్ దివ్యరాణి, లక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్వాతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
AP: ఏపీ పీజీ లాసెట్-26కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ఆచార్యులు సీతాకుమారి వెల్లడించారు. 3, 5 సంవత్సరాల LLB, రెండేళ్ల LLM కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు మార్చి 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 4న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.
కృష్ణా: పెనమలూరు పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసుకు ముగింపు పలికింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నీళ్లు అడిగినట్లు నటిస్తూ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బాలికను అసభ్యంగా తాకిన స్వామియేలు దోషిగా తేలాడు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడికి ఐదేళ్లు శిక్ష 2000 జరిమానా విధించింది.