SKLM: జిల్లాలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ మంగళవారం రాత్రి రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాల బాధితులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ASR: గొర్రెల మేకల పెంపకం దారుల సమస్యలు పరిష్కరించాలని గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్, జిల్లా కార్యదర్శి జి.దేముడుబాబు డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి రామునాయుడు భవనంలో మాట్లాడుతూ.. సమస్యలపై వచ్చే నెల 4న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గొర్రెల మేకల పెంపకం దారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు.
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో ఈనెల 26 నుంచి మార్చి 10 వరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో తగిన గుర్తింపుతో పాటు సేవా కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NDL: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మరి కొందరికి డిప్యూటీ కలెక్టర్లుగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్‌పై పోస్టింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా బనగానపల్లె ఆర్డీవోగా నరేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు రాత్రి చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.
KRNL: పత్తికొండ పట్టణంలోని నడిరోడ్డుపై మంగళవారం రాత్రి ఓ పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు చెడిపోయింది. కోర్టు, పోలీస్ స్టేషన్, రీడింగ్ రూమ్, నాలుగు స్తంభాల కూడలి వంటి ముఖ్యమైన ప్రాంతాలు కావడంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరుకు రోడ్డుపై గంటసేపు బస్సు నిలిచి ఉండిపోవడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.
NLR: కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామ సర్పంచ్ ఏలూరు ప్రభావతి తన పొలాన్ని అక్రమించుకున్నారని అదే గ్రామానికి చెందిన నూటేటి జనజ ఆరోపించారు. రీ సర్వేలో తన భూమిని సర్పంచ్ పేరు మీదకి మార్చుకున్నారని వాపోయారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
CTR: రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌లో పనిచేస్తున్న అనుపమను నగరి ఆర్డీవోగా నియమించారు. ప్రస్తుతం నగరిలో ఆర్డీవోగా ఉన్న భవాని శంకర్ రెడ్డిని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేశారు.
TPT: తిరుపతిలోని ఆటోనగర్‌కు చెందిన అశాలత (19), ఆమె మేనవరాలు దుర్గా (2) అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదని తల్లి నాగరత్నం ఫిర్యాదు చేశారు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెగా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని MLA ఆనందరావు మంగళవారం శాసనసభలో కోరారు. జిల్లాలో క్వాయర్ ఇండస్ట్రీ లేకపోవడాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రస్తావించారు. ‘వన్ ఫ్యామిలీ -వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యంగా అడుగులు వేయాలని, ఉపాధి అవకాశాల కోసం మెగా పరిశ్రమలు తక్షణమే నెలకొల్పాలన్నారు.
PPM: పాలకొండ నగర పంచాయతీలోని శిర్లిపోతన్న ఆలయం వద్ద మంగళవారం జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయం ముందర ఉన్న పోతురాజు విగ్రహం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పూజలు చేశారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో దేవరపేట నుంచి వెంకమ్మపేట వరకు శిర్లు యాత్ర సందడి నెలకొంది.
KKD: 18వ లోక్ సభ కాలానికి సంబంధించి బల్గేరియాతో పార్లమెంటరీ ఫ్రెండ్దిప్ గ్రూప్ ఏర్పాటయింది. ఇందులో సభ్యునిగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ను లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మంగళవారం నామినేట్ చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటానని సానా సతీశ్ తెలిపారు.
ATP: శింగనమల నియోజకవర్గ సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. బుక్కరాయసముద్రం చెరువు ఆధునీకరణ, బీటీ రోడ్డు పనులతో పాటు నార్పల మండల గ్రామాల కోసం హెచ్‌ఎల్‌సీ నుంచి నక్కనూతి కుంటకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు.
VSP: ఆరిలోవలోని జరిగిన హత్య కలకలం రేపింది. భార్య దుర్గ (33) పై అనుమానంతో ఆమె భర్త చున్నీతో మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. లైఫ్ స్టైల్‌లో ఉద్యోగం చేసే నిందితుడు, హత్య అనంతరం తప్పించుకోలేక ఇంట్లోనే ఉన్న ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్నాడు. అయితే, ఇంటి బయట నిలిపి ఉన్న బైక్ ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు లోపల వెతకగా అసలు విషయం బయటపడింది.
VZM: ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మెరకముడిదాం మండల కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల అధికారిగా స్దానిక MRO సులోచన రాణి వ్యవహరించారు. మండల అధ్యక్షుడిగా తిరుపతిరావు, ఉపాధ్యక్షుడిగా ఆదినారాయణ, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీలత, సంయుక్త కార్యదర్శి సావిత్రీని ఎన్నుకున్నారు. VRO హక్కుల కోసం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
అన్నమయ్య: కొత్తకోట మండలం రంగనాథపురంలో వృద్ధ దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీధిలో గొర్రెలను తోలుకురావడంపై తలెత్తిన వివాదంలో కృష్ణప్ప, కృష్ణమ్మలపై అదే గ్రామానికి చెందిన ఆరుగురు కర్రలతో దాడి చేశారు. బాధితుల కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కాండ్లమడుగు క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.