BPT: పిట్టలవానిపాలెం మండల హైవేలపై ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. నిద్రమత్తులో ఉన్న వాహన డ్రైవర్లను ఆపి, వారి ముఖాలు కడిగించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలసట, నిద్ర కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
AKP: జిల్లాలో ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అప్పారావు నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 125 పరీక్ష రుసుము చెల్లించాలన్నారు ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.
అన్నమయ్య: మదనపల్లి మండలం సీటీఎంలో ఇటుకల బట్టీ కార్మికుడిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన శివయ్య మంగళవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గంగమ్మ గుడి వద్ద స్పీడ్ బ్రేకర్‌పై బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివయ్యను స్థానికులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SKLM: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన రెండు వేర్వేరు కేసుల్లో పెద్దపాడుకి చెందిన కె.రాము అనే యువకుడికి జైలు శిక్ష విధిస్తూ శ్రీకాకుళం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంగళవారం తీర్పు వెల్లడించారు.ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయ ఓ ప్రకటనలో తెలిపారు. ముద్దాయికి ఒక్కో కేసులో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.
ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజన్ భాగాలు రెండుగా విడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని సేఫ్టీ బెలూన్లు (ఎయిర్ బ్యాగులు) తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ATP: కళ్యాణదుర్గంలోని ఆర్‌అండ్‌బీ డివిజనల్ కార్యాలయాన్ని శ్రీసత్యసాయి జిల్లాకు తరలించడం సరికాదని YCP జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. హిందూపురానికి ఆర్‌అండ్‌బీ సిబ్బందిని, కార్యాలయాన్ని తరలించవద్దని ఆయన డిమాండ్ చేశారు.
KKD: విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సహకరించాలని ఆ శాఖ ఏఈ మాధురి కోరారు. జగ్గంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం లైన్మెన్ శివప్రసాద్, సిబ్బందితో కలసి బకాయిలు ఉన్న ఇళ్లకు వెళ్లి వసూలు కార్యక్రమం చేపట్టారు. నెలలు తరబడి బిల్లులు చెల్లింపులు చేయని పలు కనెక్షన్లు నిలుపుదల చేసినట్లు ఆమె తెలిపారు.
KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నిర్వహించిన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. డోన్ గవర్నమెంట్, పత్తికొండ రాఘవేంద్ర డిగ్రీ కాలేజీల్లో జరుగుతున్న సెంటర్లలో ఒక్కొక్కరు చొప్పున డిబార్ అయ్యారు. అటు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 89 శాతం మంది, బీటెక్ పరీక్షకు 98 శాతం, లా పరీక్షలకు 92 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
PLD: జిల్లావ్యాప్తంగా మంగళవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జనరల్ కోర్సుల్లో నమోదైన 16,088 మంది విద్యార్థులకు గాను 15,523 మంది హాజరయ్యారు. అలాగే వృత్తి విద్యా కోర్సుల్లో 950 మందికి గాను 880 మంది పరీక్ష రాశారు. మొదటి రోజు పరీక్షకు మొత్తం 642 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు.
కోనసీమ: వెలగపూడి సచివాలయంలో మంగళవారం శాసనసభ విరామ సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణలు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించారు. వీటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
VZM: భారత ప్రభుత్వం పీఎం శ్రీ పథకం అమలును పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన సుమారు 170 మంది అధికారులను నోడల్ అధికారులుగా నియమించిందని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్ర నోడల్ అధికారిగా జాయింట్ సెక్రటరీగా నీరజ్ కుమార్ గయాగి నియమితులైనట్లు చెప్పారు.
సత్యసాయి: పులివెందుల పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ అహ్మద్ కలిశారు. కదిరి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను జగన్‌కు వివరించారు. వాణిజ్య విభాగం అధ్యక్షులు పీఎండీ షకీల్ కూడా ఈ భేటీలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు.
కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం రైల్వే గేట్ వద్ద ఎస్సై చంటిబాబు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వాహనాలను గుర్తించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అనుమతించిన పరిమితికి మేరకే ప్రయాణికులను తీసుకువెళ్లాలన్నారు.
W.G: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ఎమ్మెల్సీ గోపిమూర్తి మంగళవారం శాసనమండలిలో ప్రస్తావించారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వీరిని, అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లోని అన్-ఎయిడెడ్ సిబ్బందిని సైతం రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పనిముట్లను అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సామర్థ్యాన్ని పెంచేందుకు పనిముట్లు, రక్షణ పరికరాలను అందజేశామన్నారు. ఈ పరికరాలు నగర స్వచ్ఛతకు దోహదపడతాయన్నారు.