భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం రెండు సెషన్లలోనే రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణం హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్ పైన సంచలన ఆరోపణలు చేయడమే. ఈ రీసెర్చ్ సంస్థ దెబ్బతో అదానీ స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయాడు. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ రూ. 4 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న హిండెన్ బర్గ్ కంపెనీ నివేదిక భారత్ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. అదానీ స్టాక్ అయితే 20 శాతం మేర నష్టపోయాయి. మార్కెట్ రెండు రోజుల్లో ఒక శాతానికి పైగా నష్టపోయింది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో ప్రభుత్వరంగ సంస్థలు ఎల్ఐసీ, ఎస్బీఐ భారీగా పెట్టుబడులు పెట్టాయి. అదానీ గ్రూప్ సంస్థల్లో ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులపై విపక్ష నేతలు మండిపుతున్నారు. అసలు అదానీ గ్రూప్ లలో పెట్టుబడులు ఎందుకు పెట్టినట్లు అని ప్రశ్నిస్తున్నాయి. క్రోనీ క్యాపిటలిజం కోసం దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అదానీ కంపెనీల్లో పెట్టుబడుల నేపథ్యంలో ఎల్ఐసీ, ఎస్బీఐ మార్కెట్ వ్యాల్యూ కూడా భారీగా పడిపోయింది. రోజుల వ్యవధిలోనే వేల కోట్లు అవిరి అయ్యింది. మరోవైపు అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. సదరు రీసెర్చ్ సంస్థ ప్రతి ఆరోపణపై గట్టి కౌంటర్ ఇచ్చింది.