ఎండు మిర్చి బంగారంతో పోటీ పడటం కాదు.. బంగారాన్ని మించి ఒకటిన్నర రెట్లు పలికింది! మార్కెట్లో ఎండు మిర్చికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. దిగుమతి తగ్గడం, పచ్చళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఎండు మిర్చి రికార్డు ధర పలుకుతోంది. శుక్రవారం ఎనుమాముల మార్కెట్లో ఎండు మిర్చి ధర క్వింటాల్‌కు ఏకంగా రూ.80,100 పలికింది. అయితే అన్ని రకాల మిర్చికి ఈ ధర రాలేదు. పచ్చళ్లు, ఔషదాలలో వినియోగించే ఓ రకమైన మిర్చి ఆసియా అతిపెద్ద ఎనుమాముల మార్కెట్‌కు ఈసారి తక్కువగానే రావడంతో ధర అమాంతం పెరిగింది.
మార్కెట్‌కు ఎండు మిర్చి తక్కువ రావడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. ఈ రోజు రూ.80,000 పలికిన ఎండు మిర్చి పచ్చళ్ళకు, మెడిసిన్ వినియోగానికి ఫేమస్. విదేశాలకు కూడా పంపిస్తారు. దీనిని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు నాలుగైదు బస్తాలు తెచ్చారు. వ్యాపారులు ఎగబడి మరీ దీనిని కొనుగోలు చేశారు. సరుకు ఎక్కువగా రావడం లేదని, అందుకే ధరలు అమాంతం పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా రోజుకు వేలాది బస్తాలు రావాలని, కానీ అలా రావడం లేదన్నారు. ఎండు మిర్చి పంటకు ఈసారి తెగులు వచ్చి, పంట దిగుబడి తగ్గింది.