తెలంగాణ రాజకీయాల్లో రోజుకో పరిణామం జరుగుతోంది. ఇప్పటికే రాజకీయాలు వేడెక్కగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరింత హీటెక్కాయి. తాజాగా ఈ గవర్నర్ వ్యవహారంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల రంగంలోకి దిగనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాజ్ భవన్ లో అపాయింట్ మెంట్ కోరారని పార్టీ వర్గాలు తెలిపారు. గురువారం గవర్నర్ తమిళిసైని షర్మిల కలువనున్నారు.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారితో షర్మిల సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలపై వినతి పత్రం ఇవ్వనున్నట్లు సమాచారం.
గవర్నర్ ను కలిసిన అనంతరం రాజ్ భవన్ నుంచే నేరుగా పాదయాత్రకు ఆమె బయలుదేరనున్నారని వైఎస్సార్ టీపీ వర్గాలు తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. ఆగిన చోట నుంచే ప్రారంభం కానున్న ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర కొనసాగించనున్నారు. నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండాలో పాదయాత్రకు విరామం పడిన విషయం తెలిసిందే.