»What Is The Progress Achieved In Ten Years Of Telangana Who Has Benefited
Telangana: పదేళ్ల తెలంగాణలో సాధించిన ప్రగతేంటి.. లాభపడిందెవరు ?
తెలంగాణ దశాబ్ది వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నేటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతోంది.
Telangana: తెలంగాణ దశాబ్ది వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నేటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లు పాలన పూర్తి చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం(KCR Govt) ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా. మరో నాలుగు నెలలో ఓట్ల(Votes) హడవుడి మొదలు కానుంది. మరోమారు అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కేసీఆర్ ప్రజలకు ఎంతవరకు మేలు చేశారన్నది ప్రస్తుత ప్రశ్న. ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని నిజాలు చెప్పారు.. ఎన్ని అబద్ధాలు చెప్పారు? తెలుసుకోవాల్సిందే.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ముఖ్య లక్ష్యమే నీళ్లు, నిధులు, నియామకాలు.. మరి రాష్ట్రం వచ్చి 9ఏళ్లు అయింది. అందరికీ ఉద్యోగాలు వచ్చాయా.. కేసీఆర్ మాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న నిరుద్యోగుల సంగతేంటి. రెండోసారి నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి నిలువు దోపిడీకి పాల్పడ్డారు. ప్రభుత్వ విద్య మెరుగుపడలేదు.. చదువుకున్న వారికి ఉద్యోగాల్లేవు. అధికారం చేపట్టి తొమ్మిదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయని ప్రభుత్వం ఎన్నికలు రానుండడంతో హడావుడి నోటిఫికేషన్లు ఇచ్చింది. తీరా చూస్తే ఆ నోటిఫికేషన్లన్నీ లీకేజీలే.
నీళ్ల సంగతికొస్తే.. కలల ప్రాజెక్ట్ అని లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం(Kaleswaram) కట్టారు. జూన్ 21, 2019న ఈ ప్రాజెక్టు ప్రారంభించి నాలుగేళ్లయింది.. దీని కింద ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు పండాయి. కాళేశ్వరం పేరు చెప్పి సాగునీటి పథకాలన్నింటిని నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం పరిస్థితి ఇంతే. నదీజలాల వాటాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను ఆంధ్రాకు దోచుకునే అవకాశం కల్పించింది.
మిగులు బడ్జెట్ తో ప్రారంభమైన తెలంగాణ ప్రభుత్వం నేడు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఎఫ్ఆర్బిఎం(FRBM) పరిమితికి మించి రుణాలు తీసుకోవడంతో పాటు, కార్పొరేషన్లను సృష్టించి, ఎక్కడపడితే అక్కడ అప్పులు చేసింది. రెండు నెలల క్రితం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అక్టోబర్ 2022 నాటికి మొత్తం తెలంగాణ రాష్ట్ర అప్పు రూ. 4,33,817.6 కోట్లు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు మరో లక్షా 50 వేల కోట్లు అప్పుగా తీసుకున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం ముందూ వెనుకా ఆలోచించకుండా అప్పులు చేయడంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.
రైతుబంధు పేరుతో ప్రభుత్వం పెద్దపెద్ద ఆసాములకే నిధులు పంపిణీ చేస్తోంది. దళిత బంధు పేరుతో పార్టీ కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఉన్న భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించి అంచనాలు పెంచి కమీషన్లను దండుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణాలు చేపట్టిన ఆంధ్రా కాంట్రాక్టర్లు నేడు దేశంలోనే ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.. కానీ.. తెలంగాణ బడుగు, బలహీన, బహుజన వర్గాలు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు.
రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతున్నా తెలంగాణలో ఇంకా ప్రధాన సవాళ్లు అలాగే ఉన్నాయి. ప్రధానంగా నిరుద్యోగ సమస్య బాగానే ఉంది. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదన్న విమర్శలున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం జరగలేదని… దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్ లాంటి నగరాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నాయే తప్ప… పల్లెల్లో అంతగా అభివృద్ధి కనిపించడం లేదు. తండాలో ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు లేదు. ఇలాంటి సమస్యలపై దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. బంగారు తెలంగాణగా రూపాంతరం చెందుతోంది.