టర్కీ, సిరియాలో సంభవించిన భూకంప బాధిత మృతుల సంఖ్య 34 వేలు దాటింది. ఇంకోవైపు ఆదివారం టర్కీ దక్షిణ ప్రాంతమైన కహ్రమన్మరాస్ లో 4.7 తీవ్రతో భూకంపం వచ్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది. అంతేకాకుండా భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా నిర్మించిన భవనాలు కూడా కూలడం పట్ల 131 మంది భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు.
టర్కీ, సిరియా(Turkey syria)లో సంభవించిన భూకంపం(Earthquake) అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా చేరింది. భూకంపం సంభవించి వారం దాటిన కూడా ఇంకా విపత్తు నిర్వహణ సిబ్బంది శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం భూకంప బాధిత మృతుల సంఖ్య రెండు దేశాల్లో కలిపి 34,000 దాటిందని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. ఆదివారం కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియలో భాగంగా కొంత మంది ప్రాణాలతో బయటపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇంకోవైపు 1939 తర్వాత టర్కీ(Turkey)లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదేనని చెబుతున్నారు.
రెస్క్యూ బృందాలు
మరోవైపు ఆదివారం టర్కీ దక్షిణ ప్రాంతమైన కహ్రమన్మరాస్ లో 4.7 తీవ్రతో భూకంపం వచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ క్రమంలో సిరియా(syria)లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు చైనా(china) రెండో బ్యాచ్ సామాగ్రిని పంపింది. గుడారాలు, కిట్లు, జాకెట్లు, ఇతర రోజువారీ అవసరాలు, అలాగే వైద్య సామాగ్రి, రెడ్‌క్రాస్ సొసైటీ ఆఫ్ చైనా ద్వారా సిరియాకు అందిస్తున్నట్లు తెలిసింది. చైనా ఇప్పటికే టర్కీ, సిరియాలకు ఆర్థిక సహాయాన్ని అందించింది. దీంతోపాటు ఇండియా(India) ఇప్పటికే మొదట స్పందించి సామాగ్రి పంపడంతోపాటు రెస్క్యూ బృందాన్ని కూడా పంపించింది. ఆ తర్వాత అనేక ప్రాంతాల నుంచి రెస్క్యూ బృందాలు(resuce teams) వచ్చి ఇరు దేశాలకు సేవలను అందిస్తున్నాయి.
సహాయం చేయాలి
ప్రస్తుతం, ప్రతి గంట ప్రధానమైనదని ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్(linda thomas greenfield) అన్నారు. భూకంపంతో దెబ్బతిన్న సిరియాలోని పలు ప్రాంతాలకు సహాయాన్ని అందించడానికి మరో రెండు యాక్సెస్ పాయింట్లను ఆమోదించాలని లిండా థామస్ UN భద్రతా మండలిని కోరారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తమపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో వారికి సహాయం చేయాలని మానవాళికి విజ్ఞప్తి చేశారు. UN పాటించే తీర్మానంపై ఓటు కూడా వేయాలని ఆమె కోరారు. ఇది అత్యవసర సమయమని ప్రతి ఒక్కరూ స్పందిచాల్సిన సమయం వచ్చిందన్నారు.
నిర్మాణ నిబంధనలు అమలు చేయలే
ఇంకోవైపు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్(Recep Tayyip Erdogan) ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనలను సరిగా అమలు చేయడం లేదని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపించాయి. 1999లో చివరిగా సంభవించిన భారీ భూకంపం తర్వాత భవనాలను భూకంపాలకు మరింత తట్టుకునేలా నిర్మించడానికి విధించిన నిబంధనలను పాటించలేదని విమర్శించారు. ఈ క్రమంలో 2022లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్‌లో 47 స్థానాలు దిగజారి టర్కీ 101కి పడిపోయిందని పేర్కొన్నారు. ఇదే సూచిలో టర్కీ 2012లో 174 దేశాలలో 54వ స్థానంలో ఉన్నట్లు గుర్తు చేశారు.
కంట్రాక్టర్లపై చర్యలు
దీనిపై స్పందించిన టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫువాట్ ఓక్టే(Fuat Oktay) భూకంపాలను తట్టుకునే విధంగా భవనాలు నిర్మించని 131 మంది కంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వారిపై విచారణ కూడా జరుగుతోందని చెప్పారు. న్యాయ ప్రక్రియ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భూకంపం జోన్ ప్రావిన్సులలో ఇప్పటికే మృతుల వివరాలతోపాటు భవనాల గురించి ఆరా తీసేందుకు దర్యాప్తు బ్యూరోలను ఏర్పాటు చేసినట్లు ఆక్టే తెలిపారు. 1,70,000 భవనాల్లో ఆధారంగా భూకంపం కారణంగా 24,921 భవనాలు కూలిపోయి.. భారీగా దెబ్బతిన్నాయని గుర్తించినట్లు వెల్లడించారు.