తమిళనాడు ముఖ్యమంత్రి (chief minister of tamil nadu), డీఎంకే అధినేత (DMK chief) ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలు (MK Stalin BirthDay Celebrations).. కాంగ్రెస్ (Congress) సహా ప్రతిపక్షాల ఐక్యత ప్రదర్శనగా నిలిచాయి. నిన్న మార్చి 1న స్టాలిన్ (MK Stalin) పుట్టిన రోజు. బుధవారం 70వ పుట్టిన రోజు సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే (Congress president Mallikarjun Kharge), జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి (Chief Minister), నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) నేత ఫరూక్ అబ్దుల్లా (farooq abdullah), ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav), బీహార్ ఉపముఖ్యమంత్రి (Bihar), ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) చెన్నైకి వచ్చారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం ఇక్కడి నందనం వైఎంసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. కాంగ్రెస్ రహిత కూటమిని ఏర్పాటు చేయాలన్న కొన్ని పార్టీల ప్రయత్నం ఏ మాత్రం సరికాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ తో కూడిన కూటమిదే విజయం అన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు అర్థమే లేదన్నారు. వచ్చే ఏడాది జరిగే లోకసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షాలు అన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రానున్న 2024 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకమని, ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నదాని కంటే ఏ పార్టీ అధికారంలోకి రాకూడదో గ్రహించి ప్రతిపక్షాలు కలిసి పని చేయాలన్నారు. అప్పుడే బీజేపీని ఓడించగలమని చెప్పారు.
ఆయా రాష్ట్రాల్లో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. లోకసభ ఎన్నికల తర్వాత జట్టుకట్టడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదన్నారు. అలాగే, థర్డ్ ఫ్రంట్ చర్చలకు అర్థం లేదన్నారు. తద్వారా కాంగ్రెస్ వైపు వివిధ రాష్ట్రాల్లోని పార్టీలను… బీజేపీయేతర పార్టీలను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్టాలిన్ తమిళనాడుపై కూడా మాట్లాడారు. 2004లో కరుణానిధి హయాంలో 40 స్థానాల్లో గెలిచామని, గత లోకసభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని మాత్రమే కోల్పోయామని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో 40 సీట్లు గెలిచి సత్తా చాటుతామన్నారు.
ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ… ప్రధానమంత్రి ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి 2024లో గెలవాల్సి ఉందన్నారు. స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నారు. ప్రధాని అయ్యేందుకు ఆయనకు అవకాశాలు ఉన్నాయని, ప్రధాని ఎవరనే అంశం కాంగ్రెస్ మరిచిపోవాలన్నారు. లోకసభ ఎన్నికల్లో గెలుపు పైనే దృష్టి సారించాలన్నారు. బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలు ఏకం కావాలని ఖర్గే కూడా పిలుపునిచ్చారు. బీజేపీ వ్యతిరేక కూటమిని ఎవరు లీడ్ చేస్తారు… గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అనే విషయాన్ని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. పదవులు పక్కన పెట్టి గెలుపును లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. బీజేపీ వల్ల మనం ప్రమాదంలో పడ్డామని తేజస్వి యాదవ్ అన్నారు. సామాజిక న్యాయంపై స్టాలిన్ వైఖరిని నేను అభినందిస్తున్నానని, ఆయన రాజకీయంగా గొప్ప స్థాయికి, జాతీయస్థాయికి ఎదుగుతారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర రావు, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు హాజరు కాలేదు. వీరు బీజేపీతో పాటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే స్టాలిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.