టెన్నిస్ ఆటలో రారాజుగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ -2023 టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో ఆదివారం గ్రీకు దిగ్గజం సిట్సిపాస్ తో హోరాహోరీగా తలపడి ఆఖరికి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. గతేడాది కరోనా వ్యాక్సిన్ కారణంగా తీవ్ర విమర్శల పాలై ఆస్ట్రేలియన్ ఓపెన్ కు దూరమైన జకోవిచ్ ఈసారి కసితో ఆడి టైటిల్ ను ముద్దాడాడు.
ఫైనల్ పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. జకోవిచ్ 6-3, 7-6 (74), 7-6 (75) తేడాతో సిట్సిపాస్ పై విజయం సాధించాడు. దూకుడుగా ఆడి తొలి సెట్ ను సునాయాసంగా సొంతం చేసుకున్న జొకోవిచ్ కు రెండో సెట్ లో తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది. సిట్సిపాస్ చెమటలు పట్టించాడు. రెండో సెట్ సమం కావడంతో టై బ్రేక్ కు దారి తీసింది. టై బ్రేక్ లో జొకోవిచ్ 7-4తో అదరగొట్టి రెండో సెట్ ను చేజిక్కించుకున్నాడు. ఇక నిర్ణయాత్మకమైన మూడో సెట్ కూడా సమం కావడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇద్దరు టైటిల్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. టై బ్రేక్ లో 7-5తో సిట్సిపాస్ ను ఓడించిన జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ గా నిలిచాడు. ఈ విజయంతో టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. తన కెరీర్ లో పదో ఆస్ట్రేలియన్ టైటిల్ సాధించగా.. మొత్తం తన ఖాతాలో 22 గ్రాండ్ స్లామ్ సాధించి నాదల్ (22) రికార్డును సమం చేశాడు. తొలిసారి 2008లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్న జొకోవిచ్ ఆ తర్వాత వరుసగా 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023లో చాంపియన్ గా నిలిచాడు.