జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల తన వారాహీ వాహనాన్ని వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కొండగట్టుకు, అక్కడి నుండి ధర్మవరం, ఆ తరువాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవాలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించారు.
ఈ పూజల సమయంలో అమ్మవారికి చీరను సమర్పించారు. కాగా, అమ్మవారికి సమర్పించిన చీరలను ఆలయ అధికారులు భక్తులకు సమర్పిస్తారు. అయితే, సాధారణ చీరలకు, పవన్ కళ్యాణ్ సమర్పించిన చీరలకు తేడాను గుర్తించిన అధికారులు ఆ చీరను ఎవరికి ఇవ్వాలి అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
పవన్ కళ్యాణ్ సమర్పించిన చీర ఖరీదు రూ. 8 వేలకు పైగా ఉండటంతో ఆ చీరను ఎవరికి ఇవ్వాలనే దానిపై అధికారులు తర్జనభర్జన అవుతున్నారు. భక్తుల నుండి ఆ చీర కోసం డిమాండ్ పేరుగుతున్నది. అయితే, పవన్ కళ్యాణ్ సమర్పించిన చీరను వేలం వేయాలని, ఆ వేలంలో ఎవరు ఎక్కువ మొత్తానికి పాట పాడుతారో వారికి ఆ చీరను ఇవ్వాలని భక్తులు, పవన్ అభిమానులు డిమాండ్ చేశారు.
భక్తులు కోరినట్లుగా అలా చేస్తే, ఆలయ అధికారులు డబ్బుకోసమే ఇలా చేస్తున్నారనే విమర్శలు వస్తాయని అధికారులు అనుమానించారు. కాగా, చివరగా అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారికి సమర్పించిన చీరను తిరిగి పవన్ కళ్యాణ్‌కు అందజేయాలని నిర్ణయించారు. త్వరలోనే చీరను పవన్‌కు అందజేయనున్నారు.