మహిళలను కించ పరుస్తూ చేస్తున్న కామెంట్స్ కి బాబా రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనకు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా క్షమాపణ లేఖ నేడు విడుదల చేశారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే తనను క్షమించాలని ఆయన కోరారు.
గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠానే నగరంలో పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి కలిసి యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. మహారాష్ట్ర డెప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా ఫడణవీస్ సహా పలువురు మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన అనంతరం ఓ సమావేశం జరిగింది. సమయం లేకపోవడంతో ఆ సమావేశంకు కొందరు మహిళలు యోగా దుస్తుల్లోనే హాజరయ్యారు. అది చుసిన రామ్‌దేవ్.. ‘స్త్రీలు చీరల్లో, సల్వార్ సూట్లలో అందంగా ఉంటారు. అసలేం ధరించకపోయినా బాగుంటారు’అని నోరు జారారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు.
‘మహిళలు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలని వారి సాధికారత కోసం నేను ఎప్పుడూకృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంను నేను ప్రోత్సహిస్తా. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో క్లిప్ వాస్తవం కాదు. అయినా కూడా ఎవరైనా బాధపడితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు చెపుతున్నా’ అని రాందేవ్ బాబా పేర్కొన్నారు.