»Next Decade Will Unveil The Impact Of Jagan Rule Nara Lokesh Says
Nara Lokesh: జగన్ పాలన ప్రభావం పదేళ్లు
ముఖ్యమంత్రి జగన్ పాలనా ప్రభావం వచ్చే పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడనికి కేవలం పదేళ్లు చాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అయిదేళ్ల పాలనా ప్రభావం వచ్చే పదేళ్ల పాటు రాష్ట్రం పైన ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి కేవలం పదేళ్లు చాలునని, దశాబ్దం పాటు చంద్రబాబుకు (Chandrababu Naidu) అధికారం ఇస్తే రాష్ట్ర దశ, దిశ మారుతుందన్నారు. కానీ జగన్ ఈ పాలనా ప్రభావం సుదీర్ఘంగా ఉంటుందని చెప్పారు. మరోసారి అవకాశమిస్తే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. రైతన్న రాజ్యం తీసుకు వస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్, ఇప్పుడు రైతులు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశానని అప్పుడు చెప్పాడని, కానీ ఇప్పుడు ఆయన వల్లే మరిన్ని కష్టాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్ విధానాలు చూస్తుంటే.. అప్పుడు పాదయాత్ర చేసింది, ఇప్పుడు అధికారంలో ఉన్నది ఒక్కరేనా అనే అనుమానం వస్తోందని ఎద్దేవా చేశారు.
జగన్ ప్రభుత్వం రాజధానిగా అమరావతిపై (Amaravati) ఆసక్తి చూపించని పక్షంలో ఇతర ప్రాంతాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలని నిలదీశారు. చాలామంది ఉద్యోగం, ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన, ఫెయిల్డ్ ముఖ్యమంత్రి జగన్ అని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకు వస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారుల్లో డెబ్బై శాతానికి పైగా జగన్ సామాజిక వర్గానికి చెందినవారే అన్నారు. సలహాదారులుగా, వైస్ ఛాన్సులర్లుగా బీసీలు పనికి రారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ, టీటీడీ, ఏపీఐఐసీ చైర్మన్ పదవులు, 9 వర్సిటీ వీసీలుగా బీసీలకు అవకాశమిచ్చామని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఆ తర్వాత ముఖ్యమంత్రులు కొనసాగించారని, జగన్ మాత్రం చంపేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు మనవద్దే ఎక్కువ అన్నారు. అప్పుల భారం పెరిగిందన్నారు. తాము అధికారంలోకి వస్తే తెలుగు భాషకు ప్రాధాన్యం ఇస్తూనే, ఇంగ్లీష్ విద్యకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. తన తనయుడు దేవాన్ష్‌ను తెలుగు సబ్జెక్ట్ ఉన్న పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు.
స్టూల్ ఎక్కి ప్రసంగించిన లోకేష్
చిత్తూరు మండలం ఎన్ఆర్ పేట సర్కిల్లో లోకేష్ (Nara Lokesh) మాట్లాడేందుకు పోలీసులు (Police) అనుమతి నిరాకరించారు. దాదాపు పావుగంట అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. జీవో 1 ప్రకారం రోడ్లపై సమావేశాలకు అవకాశం లేదని పోలీసులు చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని లోకేష్ కోరారు. సమీపంలోని పాలిటెక్నిక్ కాలేజీ చూపగా… యాజమాన్యం అనుమతి నిరాకరించింది. ఓ సమయంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాసేపటికి సమీపంలో మాట్లాడుకోవచ్చునని చెప్పారు. దీంతో లోకేష్ స్టూల్ ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు బంగారుపాళ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో బిల్డింగ్ ఎక్కి ప్రసంగించారు లోకేష్. ఇప్పుడు కూడా అలా ఎక్కుతారేమోనని భావించి అన్ని బిల్డింగ్స్‌ను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. కానీ లోకేష్ స్టూల్ పైన నిలబడి ప్రసంగించారు. లోకేష్ యువగళం పాదయాత్ర బుధవారం 13వ రోజుకు చేరుకుంది.