»Manipur Violence Bjp Mla Attacked By Mob In Imphal Critical
BJP MLA: ఎమ్మెల్యేపై మూకదాడి… పరిస్థితి విషమం..!
బీజేపీ ఎమ్మెల్యేపై ఓ ముఠా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే వంగ్ జాగిన వాల్టే ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకీ అసలు ఆయనపై దాడి ఎందుకు జరిగింది అంటే..
మణిపూర్(Manipur)లో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ రాష్ట్రం భగ్గున మండిపోతోంది. గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు తెలపడంతో మణిపూర్ లోని ఆదివాసులు తిరగబడ్డారు. బ్రాహ్మణులైన మైతీలను ఎస్టీల్లో చేర్చితే సహించేది లేదంటూ అనేక జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభించారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు రేగాయి. ఆదివాసులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టారు. గురువారం ఇంఫాల్, చురా చంద్పూర్, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో హింస చెలరేగింది.
ఏటీఎస్యూఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసనకు దిగారు. పలుచోట్ల ఇరు వర్గాలు దాడులకు దిగి ఇళ్లు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగులబెట్టారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌తో సమావేశమై రాష్ట్ర సచివాలయం నుంచి తిరిగి వస్తుండగా గురువారం ఇంఫాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే వంగ్జాగిన్ వాల్టేపై ఆందోళనకారులు దాడి చేశారు.
పెర్జాల్ జిల్లాలోని థాన్లోన్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాల్టే ఇంఫాల్‌లోని తన అధికారిక నివాసానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. దాడిలో ఎమ్మెల్యేతో పాటు ఆయన డ్రైవర్ గాయపడ్డాడు. ఇద్దరినీ వెంటనే ఇంఫాల్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఎమ్మెల్యే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా ఆ రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.
హింసకు సంబంధించి తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. అదనపు పారా మిలటరీ బలగాలను ఆ రాష్ట్రానికి పంపింది. ఇప్పటి వరకు హింసాత్మక ప్రాంతాల నుంచి 9 వేల మంది ప్రజలను సైన్యం రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించింది.