KCR: ఆ గిరిజనులది ఇదేం గూండాగిరి, అసెంబ్లీలో ఆగ్రహం
పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు వాటిని ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, సర్వే కూడా పూర్తి చేసి అంతా సిద్ధం చేసి పెట్టినట్లు చెప్పారు. త్వరలో పోడు భూములను పంపిణీ చేస్తామన్నారు. ఎవరికైనా గిరిజనులకు భూమి రాకుంటే గిరిజన బంధు ఇస్తామని చెప్పారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వం రాజీ పడే సమస్య లేదన్నారు. ఇదే చివరి దశ అని, ఇక ఆక్రమించే అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పారు. 66 లక్షల అటవీ భూముల్లో 11.5 లక్షల పోడు భూములు ఉన్నాయని, వీటిని పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ ఇక నుండి తాము అడవిని నరికివేయమని గిరిజనులు చెప్పాలన్నారు. అలా హామీ ఇస్తేనే పంపిణీ ఉంటుందన్నారు. పోడు భూములు పొందిన వారు మళ్లీ చెట్లు నరికితే పట్టాలు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అడవులు నరకబోమని రాతపూర్వక హామీ ఇవ్వని వారికి ఎట్టి పరిస్థితుల్లో భూములు కేటాయించమన్నారు. పోడు భూములు పొందిన గిరిజనులు అడవిని కాపాడాలని సూచించారు.
భూములు పొందిన వారికి కరెంట్, రైతు బంధు కూడా ఇస్తామన్నారు. ఈ నెలాఖరులో పంపిణీ చేస్తామన్నారు. 11 లక్షల ఎకరాలకు పైగా భూమిని అఖిల పక్ష సమావేశానికి పిలిచి, ఆ తర్వాత పంపిణీ చేస్తామన్నారు. తాము గతంలో వలె ఇష్టారీతిన పంపిణీ చేయమన్నారు. పంపిణీ చేసిన వాటిలో పోడు భూములు మాత్రమే కాదని.. ఇతర భూములు కూడా ఇస్తామన్నారు. తాము ఓట్ల కోసం ఓ మాట, ఓట్ల తర్వాత మరో మాట మాట్లాడమని చెప్పారు. దీనిని తాము రాజకీయం కోణంలో చూడటం లేదన్నారు. అటు అడవుల పరిరక్షణ, మరోవైపు గిరిజనులను కాపాడుకుంటామన్నారు.
వాస్తవానికి ప్రభుత్వ భూములు ఇవ్వాలని నిబంధన ఏదీ లేదని, ప్రభుత్వం సానుభూతితో ఇస్తుందని, అసలు వారి వాదనలో న్యాయం లేదని, అయినప్పటికీ తాము ఇచ్చేందుకు సిద్ధమన్నారు. కొద్ది నెలల క్రితం చత్తీస్గఢ్ నుండి వచ్చిన గుత్తి కోయలు అటవీ అధికారిని నరికేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.50 లక్షలు ఇచ్చామని చెప్పారు. ఇలాంటి పనులను తాము అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. గుత్తి కోయాల గూండాగిరని సహించేది లేదన్నారు. గూండాగిరి కూడా మంచిది కాదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. గిరిజనులు పోలీసులు, అటవీ అధికారుల మీద దాడి చేయవద్దని, అలాగే, గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడులు చేయవద్దని హితవు పలికారు. అలా చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఎవరి బతుకు దెరువు వారిదని, కానీ హత్యాకాండకు దిగుతామంటే చట్టం చేతులు ముడుచుకొని కూర్చోదన్నారు. అటవీ అధికారులు కూడా గిరిజనులపై రెచ్చిపోవద్దన్నారు. అలాగే గిరిజనులను రెచ్చగొట్టే పద్ధతి సరికాదన్నారు. ఇక నుండి ఒక్క గజం భూమిని కూడా ఎవరూ ఆక్రమించాల్సింది లేదన్నారు. కొంతమంది అగ్రకులాల వారు గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకొని, పదుల ఎకరాల్లో భూములను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వాల్మికీ, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సభలో తీర్మానం చేశారు.