»Joint Manifesto Of Tdp Janasena We Have Taken A Historic Decision Pawan Kalyan
AP: టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో..చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం: పవన్ కళ్యాణ్
టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం తర్వాత మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉమ్మడి మేనిఫెస్టోపై తమ సమావేశంలో ప్రధానంగా చర్చించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పోరాటం చేస్తుందన్నారు. వైసీపీ విధానాలకు తమ రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకమని ప్రకటించారు.
రాజమండ్రిలో టీడీపీ, జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ పాల్గొన్నారు. మొత్తం 14 మంది సభ్యులతో ఈ సమావేశం సాగింది. ఈ సమన్వయ కమిటీలో ప్రధానంగా 6 అంశాలపై నేతలు చర్చలు జరిపారు. ఉమ్మడి ఉద్యమాలు చేయాలని సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు నిర్ణయించారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యూహాలు రచించడానికి ఈ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది.
ఏపీలో మెజార్టీ సీట్లే లక్ష్యంగా సమన్వయ కమిటీ చర్చ:
అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడంపై రెండు పార్టీలు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టాయి. సమన్వయ కమిటీలో సభ్యులు కూడా దీనిపై ప్రధానంగా చర్చించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, పితాని సత్య నారాయణలు పాల్గొన్నారు. అలాగే జనసేన తరపున నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మహేందర్ రెడ్డి, కొటికల పూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని సమన్వయ కమిటీకి హాజరై పలు విషయాలపై చర్చించారు.
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం: పవన్
సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ మద్యపాన నిషేధం అని చెప్పి ఆ మాటను నిలబెట్టుకోలేదని, ఆ మద్యం ద్వారా రూ.30 వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. సీపీఎస్ రద్దు మాటను వైసీపీ నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ అనే తెగులు ఏపీకి పట్టుకుందన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పోరాడతామన్నారు. వైసీపీ విధానాలకు జనసేన వ్యతిరేకమని మరోమారు స్పష్టం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఏపీ ప్రజల మంచి కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అస్థిరతకు గురైన ఏపీకి సుస్థిరతను తీసుకొస్తామని పవన్ అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. దారుణాలు చేసిన అందరికీ బెయిల్ వచ్చిందని, కానీ చంద్రబాబుపై మాత్రం కక్ష తీర్చుకుంటున్నారన్నారు. అన్ని పార్టీల నేతలను వైసీపీ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలన్న దానిపై ప్రధానంగా చర్చించామని, రాష్ట్రానికి టీడీపీ, జనసేన ప్రభుత్వం కచ్చితంగా అవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ప్రజాపక్షాల గొంతు నొక్కేశారు: నారా లోకేశ్
ప్రజాపక్షాల గొంతు నొక్కేందుకు వైసీపీ చూస్తోందని నారాలోకేశ్ అన్నారు. ఏపీలో అన్ని రకాల ఛార్జీలు పెంచేశారని, 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రాజెక్టులను పట్టించుకునే పరిస్థితిలో వైసీపీ లేదని, కరెంటు, డీజిల్, పెట్రోల్, నిత్యవసరాల ధరలను వైసీపీ విపరీతంగా పెంచేసిందన్నారు. రాబోయే 100 రోజుల కార్యచరణ గురించి చర్చించినట్లు నారా లోకేశ్ తెలిపారు. నవంబర్ 1వ తేది నుంచి మేనిఫెస్టో రూపొందించి డోర్ టు డోర్ ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. అలాగే అక్టోబర్ 29, 30, 31వ తేది మూడు రోజుల పాటు టీడీపీ, జనసేన నేతలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.