»Current Bill Shocking Rs 7 7 Lakh Current Bill For An Empty House
Current Bill: షాకింగ్..ఖాళీగా ఉన్న ఇంటికి రూ.7.7 లక్షల కరెంట్ బిల్లు!
ఖాళీగా ఉన్న ఓ ఇంటికి రూ.7.7 లక్షల వరకూ కరెంట్ బిల్లు వచ్చింది. విద్యుత్ అధికారులకు సమస్యను విన్నవించినా సరైన సమాధానం లేదు. విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరిగినా నిర్లక్ష్యపు సమాధానమే వినిపించింది. సమస్యను సట్టించుకునేవారే లేక ఉప్పల్ లోని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఓ వైపు ఎండలు భయపెడుతుంటే మరో వైపు కరెంట్ బిల్లుల(Current Bills) మోత మోగుతోంది. సాధారణంగా రూ.500 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.2000 వరకూ చేరుతోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. అదంతా ఒక లెక్క అయితే ఇప్పుడు ఓ ఖాళీ ఇంటికి సైతం కరెంట్ బిల్లు భారీగా వచ్చింది. వినియోగంలో లేని ఆ ఇంటికి ఏకంగా రూ.7.7 లక్షల వరకూ కరెంటు బిల్లు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఉప్పల్(Uppal) ఏఈ పరిధిలోని హైకోర్టు కాలనీ(Highcourt Colony)లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉప్పల్లోని ఓ ఇంటి కరెంట్ బిల్లు(Current Bill) ఏకంగా రూ.7,71,072 రావడం చూసి ఆ ఇంటి యజమాని షాక్ అయ్యాడు. హైకోర్టు కాలనీలో ఉండే పాశం శ్రీదేవి ఇంటికి కరెంటు మీటర్లు 2 ఉన్నాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లోని పోర్షన్ ఖాళీగానే ఉంది. ఆ ఇంటికి ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 వరకూ కరెంటు బిల్లు వస్తూ ఉండేది. మే, జూన్ నెలలకు సంబంధించిన కరెంటు బిల్లును ఆన్లైన్ లో చూడగా కరెంటు బిల్లు ఏకంగా రూ. 7,71,072లు వచ్చింది. బిల్లును చూసి వారికి గుండె ఆగినంత పనైంది.
బాధితులు విద్యుత్ అధికారులను సంప్రదించారు. అయితే అక్కడి అధికారులు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. డిడి(DD) కట్టుకొని చెక్ చేయించుకోవాల్సేనని అలా కాకుంటే వచ్చిన బిల్లు కట్టి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారు. మీటర్(Meter) మార్చేందుకు ఉప్పల్లోని విద్యుత్ కార్యాలయానికి వెళితే అక్కడ కూడా సరిగా పట్టించుకోలేదు. అధికారులు గంటల కొద్ది సమయాన్ని వృధా చేసినట్లు శ్రీదేవి తల్లి అండాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని అండాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి గమనించి పైఅధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.