»Comments On Peshwa Brahmins Hd Kumaraswamy Clarifies
HD Kumaraswamy: బ్రాహ్మణులు సీఎం కావొచ్చు.. కానీ వారు మాత్రమే
జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో రాజకీయ దుమారం రేపాయి. దీంతో అతను తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీష్వా డీఎన్ఏ ఉన్నవారు ముఖ్యమంత్రి కావొద్దని మాత్రమే తాను చెప్పానని, కానీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కావొద్దని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో రాజకీయ దుమారం రేపాయి. దీంతో అతను తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీష్వా డీఎన్ఏ (Peshwa DNA) ఉన్నవారు ముఖ్యమంత్రి కావొద్దని మాత్రమే తాను చెప్పానని, కానీ బ్రాహ్మణులు(Brahmin) ముఖ్యమంత్రి కావొద్దని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఏ వర్గానికి లేదా సముదాయానికి చెందిన వ్యక్తి అయినా ముఖ్యమంత్రి కావొచ్చునని, అందులో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ స్వార్థం చూసుకునే పీష్వా డీఎన్ఏ ఉన్నవారు మాత్రం ముఖ్యమంత్రి అయితే ఇబ్బంది అని మాత్రమే తాను చెప్పానని గుర్తు చేశారు. కానీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి అయితే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అసలు తాను చేసిన వ్యాఖ్యల కంటే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్… పండితులపై చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రమైనవి అన్నారు. కానీ తాను మాత్రం కేవలం పీష్వాల గురించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అంశంపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో స్పందించారు.
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై తాము మాట్లాడుతూనే ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తరుచూ కర్నాటకకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని, కానీ కమలదళం గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అని బీజేపీ చెబుతోందని, కానీ త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. కర్నాటక, గోవా, కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉందని, కాబట్టి మహదాయి నది నీటి వివాదాన్ని కొలిక్కి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ నదికి సంబంధించి సాంకేతిక, చట్టపరమైన సమస్యలను తొలగించాలని తాను బీజేపీని కోరుతున్నట్లు చెప్పారు. కానీ బీజేపీ చీప్ పబ్లిసిటీ కోసం చూస్తోందని, మహదాయికి సంబంధించి మూడు నెలల ముందే స్వీట్స్ పంచారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పటికీ ఎలాంటి ముందడుగు లేదని, కేవలం ప్రజలను మిస్ లీడ్ చేస్తోందని ధ్వజమెత్తారు. మోడీ ఏరో షో పైన కూడా విమర్శలు గుప్పించారు. దీనిని బీజేపీనే మొదలు పెట్టినట్లు గొప్పలకు పోతోందని, కానీ ఇది 14వది అని గుర్తుంచుకోవాలన్నారు. ఇది పేదరికాన్ని రూపుమాపే షో కాదని ఎద్దేవా చేశారు.
అదే సమయంలో కర్నాటక కాంగ్రెస్ నేత, విపక్ష నాయకుడు సిద్ధరామయ్యపై (Siddaramaiah) కూడా నిప్పులు చెరిగారు. బీజేపీ నాయకుల అక్రమాలను తానే బయట పెట్టానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అసలు కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా ఆయనే కారణమని ఆరోపించారు. సిద్ధరామయ్య తన యోగ్యతను మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అతను మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచి మాట్లాడకూడదన్నారు. గతంలో బీజేపీ తనను ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధపడిందని, కానీ తాము మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్తే వారు చేయిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జాతీయ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.