ప్రధాని నరేంద్రమోదీ… తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ.. ఇక్కడకు వస్తుంటే…. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతుండటం గమనార్హం. కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వెంట పలువరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
శుక్రవారం నుంచి దాదాపు వారం రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని టీఆర్ఎస్ పార్టీ నేత ఒకరు చెప్పారు. అటు గురువారం కూడా కేసీఆర్ కొందరు కీలక నేతలతో సమావేశం అయినట్టు తెలిసింది. బీఆర్ఎస్ విస్తరణ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికలపై కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.
కాగా… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అయితే.. ఈ పర్యటనకు దూరంగా ఉండేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. కొందరు బీజేపీ నేతలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రధాని కార్యక్రమానికి దూరంగా ఉండేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్టున్నారని ఆరోపిస్తున్నారు.