ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు విశ్వనాథ్ అని సీఎం కొనియాడారు. భారతీయ సామాజిక విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు తమ సినిమాలో విశ్వనాథ్ పెద్ద పీట వేశారని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సీఎం కేసీఆర్ తెలిపారు.
సంగీత, సాహిత్యాలను ప్రధాన ఇతివృత్తంగా సినిమాలు తీశారని చెప్పారు. మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకులు విశ్వనాథ్ అని పేర్కొన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కారం వారి దర్శక ప్రతిభకు నిదర్శనమన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కె. విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని సీఎం తెలిపారు.
‘జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః| నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం||
(కవి పండితులకు జనన మరణాలు వుండవు. వారి కీర్తి అజరామరం.) ఈ వాక్కు విశ్వనాథ్ కు అక్షరాలా వర్తిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
గతంలో విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంటికి వెళ్లి కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సినిమాలు ఎంతో ఇష్టమో విశ్వనాథ్ తో పంచుకున్నారు. అనంతరం విశ్వనాథ్ తో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై చర్చించారు. ఆ సందర్భంగా విశ్వనాథ్ ను ఘనంగా సత్కరించారు. కుదిరినప్పుడు మళ్లీ వస్తానని చెప్పారు. ఆ రోజు సీఎం కేసీఆర్ విశ్వనాథ్ కుటుంబసభ్యులతో దాదాపు గంట సేపు గడిపారు.
తెలుగు సినిమా వున్నన్ని రోజులు కె. విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని సీఎం అన్నారు.