»Central Government Support For Dragon Fruit Cultivation India 50 Percent Subsidy
Dragon fruit: సాగుకు కేంద్రం మద్దతు..50 శాతం సబ్సిడీ!
కమలం (dragon fruit) ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెంపకందారుల దృష్టిని ఆకర్షించింది. ఎరుపు ఊదా రంగుతో ఆహార ఉత్పత్తితోపాటు దీని ద్వారా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని దీనిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఈ పంట సాగుపై కేంద్రం 50 శాతం సబ్సిడీ అందజేస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్(dragon fruit), పిటయా, స్ట్రాబెర్రీ పియర్ & కమలం అని కూడా పిలువబడే అందమైన ఉష్ణమండల పండు. డ్రాగన్ ఫ్రూట్ ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాకు చెందినది. ఇప్పుడు దీనిని ప్రపంచవ్యాప్తంగా పండిస్తు తింటున్నారు. భారతదేశంలో డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఈ పంట సాగు పెంచారు. అయితే ఈ పంట డిమాండ్ దృష్ట్యా రైతులకు ఉపాధీహామీ పథకం ద్వారా మూడేళ్ల పాటు రూ.2.50 లక్షల ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మొక్కలు ఒకసారి నాటితే దాదాపు 20 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తాయని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. మొదటి పంట 18 నెలల్లో వస్తుందని, తర్వాత ఏడాదికి ఒకసారి మొక్కకు 40 నుంచి 50 కాయాలు కాస్తాయని వెల్లడించారు. ఒక్కో పండు మార్కెట్లు 50 రూపాయలకు పైగా పలుకుతుందని చెబుతున్నారు. ఈ పంట పండించాలని అనుకున్నవారు ఉపాధీహామీ జాబ్ కార్డు కలిగి ఉండి అయిదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులు ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మండల ఎంపీడీఓ లేదా ఈజీఎస్ ఏపీవోలకు అప్లై చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ములుగు, సిద్ధిపేటలో ఈ మొక్కల పెంపకం నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు.
మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) అనేది పండ్లు, కూరగాయలు, వేరు, దుంప పంటలు, పుట్టగొడుగులు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, సుగంధ మొక్కలు, కొబ్బరి, జీడిపప్పు, కోకో, వెదురుతో కూడిన ఉద్యాన రంగ పంటలకు సంబంధించింది. దీని కింద ఈశాన్య & హిమాలయాలోని రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మొత్తం వ్యయం(expenditure)లో 60% భారత ప్రభుత్వం అందిస్తుంది. 40% వాటా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించబడుతుంది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం 90% సహకరిస్తుంది. ఇది కాకుండా కుంకుమపువ్వు సహా ఇతర ఉద్యానవన సంబంధిత కార్యకలాపాల కోసం కూడా MIDH రాష్ట్ర ప్రభుత్వాల మిషన్లకు సాంకేతిక సలహాలు, పరిపాలనాపరమైన సహాయాన్ని కూడా అందిస్తుంది.
భారతదేశం(india)లో డ్రాగన్ ఫ్రూట్ సాగు(cultivation) విస్తీర్ణం 3,000 హెక్టార్లకు పైగా ఉంది. ఇది దేశీయ డిమాండ్‌ను తీర్చలేకపోతుంది. అందువల్ల భారతీయ మార్కెట్లో లభించే డ్రాగన్ ఫ్రూట్స్‌లో ఎక్కువ భాగం థాయిలాండ్, మలేషియా, వియత్నాం, శ్రీలంక నుంచి దిగుమతి అవుతున్నాయి. భారతదేశంలో కమలం దిగుమతి 2017లో 327 టన్నుల పరిమాణంతో ప్రారంభమైంది. ఇది 2019లో 9,162 టన్నులకు గణనీయంగా పెరిగింది. 2020, 2021లో అంచనా దిగుమతులు వరుసగా 11,916 మరియు 15,491 టన్నులుగా ఉన్నాయి. 2021లో అంచనా దిగుమతుల విలువ రూ.100 కోట్లు.