»Balagam Movie Bags Onyko Films Award In Best Drama Feature Film Category
Balagam ప్రపంచ దేశాల్లో దూసుకెళ్తున్న బలగం.. మరో అవార్డు
ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. ఈ సినిమాను పలు గ్రామాల్లో రచ్చబండ వద్ద గ్రామస్తులంతా కలిసి వీక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 గ్రామాల్లో ఈ సినిమాను బహిరంగ ప్రదర్శన చేశారు. సినిమా చూస్తూ పల్లె ప్రజలు కన్నీళ్లు పెట్టిన వీడియోలు వైరల్ గా మారాయి.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాల ఇతివృత్తంలో రూపుదిద్దుకున్న సినిమా బలగం(Balagam Movie). ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ థియేటర్లలోనే కాదు మారుమూల పల్లెల్లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. కలెక్షన్లు, ప్రశంసలతో పాటు అవార్డులు సాధిస్తోంది. జబర్దస్త్ నటుడు వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డు (Los Angeles awards)లను రెండింటిని సొంతం చేసుకోగా.. తాజాగా మరో అంతర్జాతీయ అవార్డును దక్కించుకుంది.
ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda), కావ్య (Kavya Kalyan) హీరోహీరోయిన్లుగా దిల్ రాజు వారసులు హర్షిత్, హన్షిత నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు వరుస అవార్డులు లభిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ (Ukraine)లో జరిగిన ఓనికో ఫిల్మ్ అవార్డుల్లో (Onyko Films Awards) బలగం సినిమాకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పురస్కారం దక్కింది. మార్చ్ 3వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఆకర్షిస్తోంది. ఇటు ఓటీటీలోనూ ట్రెండింగ్ లో ఉంది.
అలాంటి ఈ సినిమాకు గత నెలలో లాస్ ఏంజిల్స్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు(Best Director), ఉత్తమ సినిమాటోగ్రఫీ (Best Cinematography) విభాగంలో వేణు ఎల్డండి, ఆచార్య వేణుకు అవార్డులు లభించిన విషయం తెలిసిందే. ‘సినిమా బృందం, నిర్మాతలకు దక్కిన గొప్ప విజయం. సినిమాని రూపొందించడంలో వారి పని నాణ్యతను తెలియజేస్తుంది’ అవార్డుల కమిటీ ప్రశంసించింది. ఈ అవార్డులు రావడంపై నిర్మాత దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు.
కాగా అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోతో పాటుగా సింప్లీ సౌత్ ఓటీటీ (OTT) ఫ్లాట్ ఫామ్స్ లో మార్చి 24న విడుదలైన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. ఈ సినిమాను పలు గ్రామాల్లో రచ్చబండ వద్ద గ్రామస్తులంతా కలిసి వీక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 గ్రామాల్లో ఈ సినిమాను బహిరంగ ప్రదర్శన చేశారు. సినిమా చూస్తూ పల్లె ప్రజలు కన్నీళ్లు పెట్టిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే బహిరంగంగా వీక్షించడంపై దిల్ రాజు అసంతృప్తిలో ఉన్నాడు. థియేటర్, ఓటీటీలో చూడకుండా ఇలా బహిరంగంగా చూడడంతో తమకు ఆదాయం పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.