»Ap Ys Jagan Launched Family Doctor Programme In Palnadu District
ఏపీలో Family Doctor ప్రారంభం.. గొప్ప పథకంగా అభివర్ణించిన సీఎం జగన్
వైద్యుడి కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ డాక్టర్ తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు.
ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Govt of Andhra Pradesh) మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామాలకు వైద్యారోగ్య సేవలను చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ (Family Doctor) అనే కార్యక్రమం తీసుకువచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ప్రారంభించడం వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ (YS Jagan) పేర్కొన్నాడు. పేదవాడు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకువచ్చినట్లు వెల్లడించాడు.
పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట (Chilakaluripet) మండలం లింగంగుంట్ల గ్రామంలో గురువారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైద్యుడి (Doctor) కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ డాక్టర్ తో వ్యాధులు (Diseases) ముదరకముందే గుర్తించవచ్చు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ (YSR Village Clinic)లో వైద్యులు అందుబాటులో ఉంటారు. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు కూడా ఉంటాయి’ అని సీఎం జగన్ తెలిపాడు.
‘అన్ని వైద్య సేవలు గ్రామంలో ఇంటి ముంగిటే అందించే గొప్ప పథకం ఇది’ జగన్ పేర్కొన్నాడు. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దకే వచ్చి వైద్యం అందిస్తాం. మందులు ఉచితంగా అందిస్తాం. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. పేదల ఇంటికే వైద్య సేవలు అందించడమే లక్ష్యం’ అని ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలును వివరించాడు. కాగా ఈ సభలో ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శలు చేస్తూ ప్రసంగం చేశాడు.