జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) పోటీ చేసే స్థానంలో వాలంటీర్ ను నిలబెడతామని ఏపీ మంత్రి జోగి రమేష్(jogi ramesh) పేర్కొన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పవన్ ఒంటరిగా మీ పార్టీ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా వైసీపీ తరఫున ఓ వాలంటీర్ ను నిలబెట్టి చిత్తు చిత్తుగా ఓడిస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అసలు పవన్ కు ఏపీలో తిరిగేందుకు అర్హత లేదని ఆరోపించారు. పవన్ ఉండేది, తినేది, తందనాలు ఆడేది పక్క రాష్ట్రంలోనని వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే పవన్ వాలంటీర్ల(volunteers) గురించి వ్యాఖ్యలు చేస్తే ఏపీలో ఉన్న వాలంటీర్లు ఎలా స్పందించారో మీరు చూశారని వెల్లడించారు. వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శమని జోగి రమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరి పనుల పట్ల ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ను తాకలేరని అన్నారు. ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరమని, మా సీఎంను తాకాలంటే ముందుగా మమ్మల్ని అందిరిని దాటుకుని వెళ్లాలని పేర్కొన్నారు.