»Ap Assembly Sessions Ysrcp Mlas Attack On Tdp Mlas In Assembly
AP Assembly నిండు సభలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి.. YCP ఎమ్మెల్యేల రౌడీయిజం
పవిత్రమైన నిండు సభలో సభ్యులపై వైఎస్సార్ సీపీ దాడులకు పాల్పడిందని టీడీపీ సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తన రౌడీయిజాన్ని అసెంబ్లీలో కూడా వైసీపీ చూపిస్తోందని మండిపడ్డాడు. బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ (AP Assembly Budget Sessions) సమావేశాల్లో దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) కొనసాగిస్తున్న అరాచక పాలనపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నిరసనలు వ్యక్తం చేస్తున్నది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులపై దాడులు (Attack) జరుగుతున్నాయి. అసెంబ్లీలో మాట్లాడకనివ్వకపోవడం, సస్పెన్షన్ (Suspension) విధిస్తోంది. తాజాగా ఎమ్మెల్యేలపై దాడులు జరిగే స్థాయి అసెంబ్లీ వ్యవహారాలు దిగజారాయి. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ (TDP MLAs) ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
జీవో నంబర్ 1 రద్దు చేయాలని అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ (Speaker) పోడియాన్ని చుట్టుముట్టారు. వాయిదా తీర్మానం కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అక్కడకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాగితాలు చించి స్పీకర్ పోడియంపైకి విసిరారు. ఈ క్రమంలో టీడీపీ, అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం మొదలైంది.
సూళ్లూరుపేట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులపై దాడికి దిగాడు. ఈ క్రమంలోనే కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు మధ్య ఘర్షణ వాతావరణం ఎదురైంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై కూడా దాడి జరిగింది. ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవిత్రమైన నిండు సభలో సభ్యులపై వైఎస్సార్ సీపీ దాడులకు పాల్పడిందని టీడీపీ సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తన రౌడీయిజాన్ని అసెంబ్లీలో కూడా వైసీపీ చూపిస్తోందని మండిపడ్డాడు. సభ వాయిదా అనంతరం బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో గందరగోళ వాతావరణం ఏర్పడడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వాయిదా వేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేయడం గమనార్హం. దాడికి గురైన బాధితులపైనే స్పీకర్ చర్యలు తీసుకోవడం విస్మయానికి గురి చేసింది.