ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. అసలు ఫోన్ టాపింగ్ జరగనేలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి స్పీకర్ వద్దకు వెళ్దామని, ట్యాపింగ్ జరిగినట్లు నిరూపిస్తే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయించుకుంటానని, జరగలేదని నేను నిరూపిస్తేనీ రాజీనామా యాక్సెప్ట్ చేయించుకోగలవా అని సవాల్ విసిరారు. ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నానని, మీరు ఎప్పుడైనా రావొచ్చు… తాను సిద్ధమన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి జగన్ పైన ఇలాంటి అర్థంలేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
జనవరి 27వ తేదీనే కోటంరెడ్డికి టీడీపీలో టిక్కెట్ కన్ఫమ్ చేసారని ఆరోపించారు. పార్టీని వీడే సమయం వచ్చింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంటూ తెరపైకి తీసుకు వచ్చారన్నారు. శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కేవలం 16 సెకన్ల వీడియోను మాత్రమే విడుదల చేశాడని గుర్తు చేశారు. మీడియాకు ఫోన్లో చూపించిన ఆడియో 51 సెకండ్లు ఉందన్నారు. ఈ మొత్తం వీడియో బయటపెడితే శ్రీధర్ రెడ్డి బాగోతం బయటపడుతుందన్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురించి మాట్లాడుతూ… ఆయన చచ్చిన పాము అని, ఆయనకు ప్రాణ హానీ ఏంటో అని ఎద్దేవా చేశారు.