PLD: చిలకలూరిపేటలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. నిల్వలు లేక పలు పెట్రోల్ బంకుల్లో ఇవాళ ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం దొరక్క రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాక్టర్లకు డీజిల్ లేక వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రకాశం: పొదిలి SI రాజేశ్ ఇవాళ ఉదయం పట్టణంలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతల్లో సరైన ప్రమాణాలు పాటిస్తున్నారా అని పరిశీలించారు. బంక్ యాజమాన్యాలకు వినియోగదారులను మోసంచేసే అక్రమాలు చేయకూడదని హెచ్చరించారు. మీటర్లు సరిగా పనిచేస్తున్నాయా, సరైన పరిమాణంలో ఇంధనం అందిస్తున్నారా అని ప్రత్యేక దృష్టి సారించారు.
VZM: కొత్తవలస పోలీస్ స్టేషన్ నూతన సీఐగా విజయకుమార్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆయన విశాఖ రేంజ్ వీఆర్ నుంచి కొత్తవలసకు బదిలీపై వచ్చారు. ఈయన 1998 బ్యాచ్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన షణ్ముఖరావుకు వీఆర్‌కు బదిలీ చేసారు. సీఐ మాట్లాడుతూ.. కొత్తవలస ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తూ, రాత్రి నిఘా ముమ్మరం చేస్తానని చెప్పారు.
GNTR: ఫిరంగిపురం శాఖ గ్రంథాలయంలో రేపటి నుంచి జూన్ 6వ తేది వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి దుర్గా రెడ్డి తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిబిరాల్లో పాల్గొనాలని కోరారు. ఈ శిబిరాల ద్వారా మానసిక వికాసానికి దోహదపడే వివిధ కార్యక్రమాలు ప్రతిరోజూ నిర్వహించబడతాయని తెలిపారు.
WG: ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభచూపిన విద్యార్థులను ఎమ్మెల్యే సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో సదుపాయాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు.
NDL: ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరులో ఇవాళ ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయ్యింది. మొక్కజొన్న కోత మిషన్ పంట కోస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో పంటపై నిప్పురవ్వలు పడటంతో 20 ఎకరాలకు పైగా పంట కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.
KDP: వీరబల్లి మండలంలో జరగనున్న జాతర్లలో డీజేలకు అనుమతులు లేవని ఎస్సై సుస్మిత స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై గుర్రప్పగారిపల్లె, దిగువరాచపల్లి గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర గ్రామాల్లో అనుమతులు ఇచ్చి తమ గ్రామాలకు మాత్రమే ఆంక్షలు విధించడం సరైంది కాదని వారు ప్రశ్నిస్తున్నారు.
KRNL: రాష్ట్ర అభివృద్ధి సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలులో ఇవాళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్రాన్ని ఐదేళ్లలో దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
E.G: పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యా మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన చదువు, మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ ITDP అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు, పాఠశాల కమిటీ ఛైర్మన్ రెడ్డి దుర్గ, ఉపాధ్యాయురాలు వై.అశ్విని ఉన్నారు.
కోనసీమ: కాట్రేనికోన మండల పరిధిలోని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన ఇసుక పట్ల నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రహ్మసమేథ్యం గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ మోసానికి పాల్పడినట్లు కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపారు. నిందితుడిని ముమ్మిడివరం కోర్టులో హాజరుపరచగా న్యాయ స్థానం 15 రోజులు రిమాండ్ విధించిందని తెలిపారు.
నెల్లూరు: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సోమవారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కావలి పట్టణం బాపూజీ నగర్ మున్సిపల్ ప్లాట్స్ నందు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాచే సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు గమనించాలన్నారు.
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఇవాళ సాయంత్రం 5గం.తో ముగుస్తుందని అల్లూరి జిల్లా ఇంటర్ విద్యాధికారి భీమ శంకరావు ఓ ప్రకటనలో తెలిపారు. బెటర్‌మెంట్, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజును చెల్లించేందుకు నేడే చివరి రోజు అని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
VSP: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఇవాళ నుంచి భక్తులకు ‘చందన ప్రసాదం’ పంపిణీ ప్రారంభించనున్నట్టు EO వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. చందనోత్సవం రోజు తొలగించిన చందనాన్ని ఉ. 8 గంటల నుంచి దేవస్థానం ప్రసాద కౌంటర్ల వద్ద ప్యాకెట్ ధర రూ.10కు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ATP: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అనంతపురం జిల్లా పెద్ద కౌకుంట్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ పర్యటన సాగనుంది. ప్రజలు తమ విన్నపాలను నేరుగా మంత్రికి వివరించవచ్చని అధికారులు తెలిపారు.
NDL: కొలిమిగుండ్ల జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నేటి నుంచి రాయలసీమ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నాగకుళాయి, రమణ ఓ ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వరుస బహుమతులుగా రూ. 25,116, రూ. 15,116, రూ.10,116 అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.