ASR: ఈనెల 24న జరగనున్న పాలీసెట్, ఏపీఆర్ఎస్ ప్రవేశ పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ నిషాంతి. టీ ఆదివారం అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తగిన బందోబస్తు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.
BPT: రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో రూ.1.05కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టనున్న ఆర్కే రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌తో కలిసి ఈ పనులకు భూమిపూజ చేశారు. నాణ్యతతో కూడిన రోడ్డు నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయనున్నారు.
ATP: గుంతకల్లులో ఈ నెల 20 తేదీన జరిగే జగత్ జ్యోతి శ్రీ గురు బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వీరశైవ సంఘం అధ్యక్షుడు విరుపాక్షి రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి ఉరవకొండ గవి మఠం ఉత్తరాధికారి కర్రీ బసవ రాజేంద్ర ప్రసాద్ స్వాముల వారు హాజరవుతారన్నారు. సోమవారం సాయం కాలం 4 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.
సత్యసాయి: జిల్లాలో ఫుట్‌బాల్, బాక్సింగ్ క్రీడల జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. ఏప్రిల్ 23న హిందూపురంలో ఫుట్‌బాల్, 24న ధర్మవరంలో బాక్సింగ్ ఎంపికలు జరుగుతాయన్నారు. అండర్-15, 19, 21 విభాగాల్లో క్రీడాకారులు పాల్గొనవచ్చు. ఇక్కడ ఎంపికైన వారు విశాఖపట్నం, అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు.
TPT: శ్రీకాళహస్తి గుడిలో రూ. 500కే రాహుకేతు పూజలు యధావిధిగా కొనసాగించాలని స్థానిక BJP నాయకులు ఆలయ ఈవో వెంకటేశులకు వినతిపత్రం అందజేశారు. రూ. 500ల రాహుకేతు పూజలను రద్దు చేయాలని నిర్ణయించడం సరైనది కాదని, ఉపసంహరించుకోవాలని ఈవోని కోరారు. లేని పక్షంలో తాము నిరసనలు వ్యక్తం చేస్తామని వారు హెచ్చరించారు.
NLR: కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు పాల్గొన్నారు. చుట్టుపక్కల 10 మండలాల నుంచి వచ్చే రోగులకు సహనం, బాధ్యతతో సేవలు అందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. మందులు పూర్తిగా అందుబాటులో ఉంచాలని, రాత్రివేళల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
E.G: నల్లజర్లలో ముళ్ళపూడి బాపిరాజును అప్కాబ్ చైర్మెన్ గన్ని వీరాంజనేయులు కలిసారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. స్థానిక కార్యకర్తలతో, నేతలతో భేటీ అయ్యారు. వచ్చే మున్సిపల్, పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో వారికి దిశ నిర్దేశం చేశారు. టిడిపి జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన బాపిరాజును ఈ సందర్భంగా గన్ని అభినందించారు
NDL: బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి RWS అధికారులతో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలన్నారు. సమస్యలు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు.
GNTR: అమరావతిలోని ఐదు ఐకానిక్ భవనాల పూర్తికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. టవర్ 1 నుండి 4 వరకు, జీఏడీ టవర్‌లలో విద్యుత్, ప్లంబింగ్, ఏసీ, ఫైర్ సేఫ్టీ (MEP) పనుల కోసం టెండర్లు పిలిచింది. రూ. 1,856 కోట్లకు పైగా అంచనాతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను 18 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల కీలక కార్యాలయాల భవనాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
KKD: అధికారులు మొక్కుబడి తంతుగా కాకుండా అంకిత భావంతో జల సంరక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. పెద్దాపురం మండల పరిషత్‌లో శనివారం జలధార జల సంరక్షణపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. భావితరాల కోసం జలవనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు.
AKP: ఎలమంచిలిలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మిత్రపక్షాల వ్యతిరేకతపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పిల్లా రామకుమారి నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి మహిళా సాధికారతకు ఈ బిల్లు ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
NDL: నందికొట్కూరు పట్టణ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్వయంగా వీధులలో తిరుగుతూ చెత్త సేకరణ పనులను పర్యవేక్షించారు. ఎక్కడా చెత్త పేరుకుపోకుండా వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. స్వచ్ఛతను కాపాడడం అందరి బాధ్యత అని తెలిపారు.
W.G: భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు తాటి ముంజెలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఆకివీడు ప్రాంతంలో ముంజెలకు డిమాండ్ అమాంతం పెరిగింది. వేసవిలో మాత్రమే లభించే ఈ ప్రకృతి ప్రసాదాన్ని ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కాయ ధర రూ.25 వరకు పలుకుతుండగా, వ్యాపారులు ముంజెలను తీసి డజన్ల లెక్కన కూడా విక్రయిస్తున్నారు.
PPM: YCP రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి నియామకం పై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. తమ నాయకురాలికి కొత్త బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కురుపాం నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
NDL: ఈనెల 21న శ్రీశైలం డ్యామ్‌ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ పరిశీలించనున్నారు. 20న శ్రీశైలం చేరుకొని అక్కడే బస చేస్తారు. క్షేత్రస్థాయిలో డ్యామ్‌ను సందర్శించి, జల వనరుల శాఖ ఇరు రాష్ట్రాల అధికారులతో జలాశయం భద్రతపై సమీక్షించనున్నారు. అలాగే AP, TG రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి అంశంలో నెలకొన్న వివదంపైనా చర్చించనున్నారు.