KRNL: YCP హయాంలో మహిళలను అనేక రకాలుగా కించపరిచారంటూ నిన్న పార్లమెంట్లో MP భైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలకు MLC వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. ‘ఏపీలో కూటమి నేతల అరాచకాలు కనిపించడం లేదా? మీకు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? అఘాయిత్యాలకు పాల్పడిన వారికి పదవులు కట్టబెట్టారు. జగన్ హయాంలోనే 50% రిజర్వేషన్లు, డీబీటీ ద్వారా రూ.2.74 లక్షల కోట్లు అందించామన్నారు.
VSP: ఫేకర్స్ లే అవుట్‌లో ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. సుమారు 800 కుటుంబాలకు వినోదం, పిల్లల ఆటల కోసం వాకింగ్ ట్రాక్, ఫౌంటెన్, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థల వివరాలు, అంచనాలు సిద్ధం చేయాలని ఇంజనీర్లకు ఆదేశించారు.
VZM: మే 9న రాజాంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని స్థానిక కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శారదాంబ కోరారు. గురువారం కోర్టు ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో లోక్ అదాలత్ నిర్వహణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, బీమా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.
NDL: CM రేవంత్ రెడ్డిని గురువారం జిల్లాలోని మహిళా ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, భూమా అఖిలప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ను మహిళా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఢిల్లీకి ఏపీ టీడీపీ మహిళలు వెళ్లారు.
NDL: సంజామల మండలంలో అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.1°C, ఆ తర్వాత కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 44.9°C ఎండ తీవ్రత నమోదైనట్లు గురువారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మరోవైపు నేడు రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43°C – 44.5°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
KRNL: ఇంటర్ ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ భార్య సత్తా చాటారు. జిల్లాలోని ఆదోనికి చెందిన ఎస్.సుజాత స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివారు. సెకండియర్ MPHWలో 1000 మార్కులకు గాను, 991 మార్కులు సాధించారు. ఆటో నడుపుతూ చదివిస్తున్న భర్త జయరాం కష్టానికి ఫలితంగా ఆమె ఇలా ప్రతిభ చాటడంపై ప్రశంసలొస్తున్నాయి.
బాపట్లలో సచివాలయం తనిఖీలో డ్రెస్ కోడ్ పాటించని డిజిటల్ అసిస్టెంట్‌పై కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. విధులకు నైట్ దుస్తులతో హాజరైనందుకు సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 11 అర్జీలు పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసి, పనితీరును మెరుగుపరచాలని సూచించారు.
W.G: కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు.
ATP: కాలవ ఫౌండేషన్ ఛైర్మన్ కాలవ భరత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి భరత్‌తో కలిసి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు చక్కని వేదికలని అభిప్రాయపడ్డారు. క్రీడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
గుంటూరు: రేవేంద్రపాడు కొత్తపాలెంకు చెందిన పుప్పాల కనకమహాలక్ష్మి కష్టాలను జయించి ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితం సాధించింది. కూలీ పనులు చేసే తల్లిదండ్రుల పరిస్థితి ఆమెను మరింత పట్టుదలగా చదివేలా చేసింది. ఇంటర్ బైపీసీలో 990 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె విజయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన నూతన ఫ్లడ్ లైట్లను వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి. రాజశేఖర్ ప్రారంభించారు. హోమియో వైద్యశాల – నాగార్జున హాస్టల్ మార్గం, అర్థశాస్త్ర విభాగం–కలెక్టర్ బంగ్లా కూడలిలో ఇవి ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యార్థులకు ఇవి ఉపయుక్తంగా మారనున్నాయి.
E.G: ధవళేశ్వరం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్ల రాజబాబు (58) మృతి చెందాడు. వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి సోదరుడు భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కడప: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని మద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సోమిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్, మండల కో-ఆప్షన్ సభ్యులు బాలస్వామి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మండలంలో మంచి పేరు తెచ్చుకున్న మృదు స్వభావం కలిగిన బాలస్వామి మృతికి పలువురు అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సంతాపం తెలిపారు. మండల ప్రజలు ఆయన సేవలను కొనియాడారు.
NDL: ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్. బేబి నియామకమయ్యారు. ప్రస్తుతం ఆదోని మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమెను ఇవాళ బదిలీ చేశారు. ఖాళీగా ఉన్న కమిషనర్ పోస్టులో తన సొంత వేతన శ్రేణిలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రకాశం: 132/33 కేవీ గిద్దలూరు సబ్ స్టేషన్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలం యడవల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తైన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నారు.