NDL: పాణ్యం మండలం నెరవాడలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఆకస్మికంగా గురువారం పర్యటించారు. గ్రామ సచివాలయం, చౌక ధరల దుకాణాన్ని పరిశీలించి సేవల అమలు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణపై సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని JC సూచించారు. రేషన్ పంపిణీ పారదర్శకంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
ATP: పాత గుంతకల్లులో ఈ నెల 9న మజ్జిగ కృష్ణ అనే వ్యక్తిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడు లింగయ్య ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. పాత కక్షలు కారణంగా ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. సీఐ బి.మనోహర్ మాట్లాడుతూ..నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు
అన్నమయ్య: గుర్రంకొండ మండలం తరిగొండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 16,20,510లుగా నమోదైంది. టీటీడీ అధికారులు గురువారం హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ మొత్తం వచ్చినట్లు సూపరింటెండెంట్ మునిబాలకుమార్ తెలిపారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో పెరిగిపోయిన మొక్కలను పోలీస్ సిబ్బంది తొలగించారు. ఎస్సై చంటిబాబు మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించవచ్చని అన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
NDL: రాయలసీమకు ఇచ్చిన హక్కులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి గురువారం విమర్శించారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన హక్కులు 12 ఏళ్లుగా అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
PPM: కొమరాడ మండలం వన్నం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం తెలిపింది. ఈ మేరకు రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
KRNL: నందవరం మండలం హాలహర్వికి చెందిన విద్యార్థులు అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ప్రేమ్ కుమార్‌ను గ్రామస్థులు అభినందించారు. విద్యాభ్యాసంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.
SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఆమదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత పార్టీ స్థితిగతులపై చర్చించారు. అలాగే, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ సూచించారు.
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని శివ నగర్ కాలనీలో గల MPUP స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరిస్తూ కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, విద్య తీరును తల్లిదండ్రులకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ‘ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.
కడప శివారులోని మూలవంక వద్ద పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ గురువారం మధ్యాహ్నం చూస్తుండగానే కాలిపోయింది. స్థానికులు మంటలు ఆర్పాలని చూశారు కానీ.. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా బ్యాటరీలో ఏదైనా లోపమా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: బుట్టాయగూడెం మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఆలయ పరిసరాలను కమిటీతో పాటు అటవీ శాఖా అధికారులు పరిశీలించారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే ఆహ్లాదకరమైన వాతావరణము ఏర్పాటు చేస్తామన్నారు.
TPT: తిరుపతి రుయాలో గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలు ఇచ్చేవాళ్లు. తర్వాత ఎమర్జెన్సీ ఓపీలే ఇస్తుండగా తాజాగా టైమింగ్స్ మార్చారు. ఎండలు పెరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా ఉదయం 8గంటల నుంచే ఓపీలు ఇస్తున్నారు. సాయంత్రం 4గంటల వరకు ఓపీలు తీసుకుని సేవలు పొందవచ్చని వైద్యులు సూచించారు.
AKP: నక్కపల్లి మండలం వైసీపీ అధ్యక్షుడిగా సీతంపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గొర్ల గోవిందరావు నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండలానికి నూతన కార్యవర్గాన్ని పార్టీ కేంద్ర కమిటీ గురువారం ప్రకటించింది. అలాగే, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా మండలానికి చెందిన జి. నరసింహమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా జి బాబురావును నియమించారు.
కోనసీమ: పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడక్టు వంతెనపై శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు పునఃప్రారంభం కానున్నట్లు ఇరిగేషన్ డీఈ రవీంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మూసివేసిన ఈ వంతెనకు సుమారు రూ.61 లక్షల వ్యయంతో మరమ్మతులు పూర్తి చేశారు. వంతెనపై సోలార్ దీపాలు, ట్రాఫిక్ సూచికలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: టంగుటూరులో వాహనాలు అడ్డదిడ్డంగా పెడుతుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. టంగుటూరు బస్టాండ్ కూడలి దగ్గర నుంచి పొదిలి వైపు వచ్చే రహదారుల షాపింగ్ కాంప్లెక్స్ ముందు వాహనాలు నిలుపుతుండడంతో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పిందించి ట్రాఫిక్‌ను నియంత్రించాలని కోరుతున్నారు.