KDP: బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు కలసపాడు టౌన్లో అధికారు శనివారం దాడులు చేశారు. డి.కృష్ణారెడ్డి దుకాణంలో 4 లీటర్లు, దూదేకుల దస్తగిరిమ్మ దుకాణంలో 7 లీటర్లు, జక్క సుధాకర్ దుకాణంలో 5 లీటర్లు కలిపి మొత్తం 16 లీటర్ల పెట్రోలు సీజ్ చేశారు. అక్రమంగా పెట్రోల్ నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
KDP: బద్వేల్ నేషనల్ హైవే-67 బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం రోడ్డుపై ఉన్న పశువులను ఢీకొనడంతో 4 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. అనంతరం రోడ్డుపై ఉన్న పశువులను గమనించలేక బైకుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. బద్వేల్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ELR: బుట్టాయిగూడెం(m)వీరన్నపాలెం గ్రామంలో 15 ఏళ్ల మంచినీటి సమస్యను పరిష్కరిస్తూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నూతన ట్యాంకులను ప్రారంభించారు. ప్రజల విన్నపంపై స్పందించి కేవలం వారం రోజుల్లోనే తాగునీటి సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
GNTR: ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో రహదారి భద్రత, మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాలు జరిగాయి. జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలన్నారు. సీఆర్డీఏ పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై ప్రమాదాల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
W.G: 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తిచేసి ఇంటర్లో చేరుతున్న ఎస్సీ విద్యార్థులకు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి అరుణకుమారి కీలక సూచన చేశారు. తల్లికి వందనం పథకం లబ్ధి పొందాలంటే పోస్టల్, ఎస్బీఐ లేదా యూనియన్ బ్యాంకుల్లో విద్యార్థుల పేరిట తప్పనిసరిగా కొత్త ఖాతా తెరవాలని ఆమె స్పష్టం చేశారు.
ATP: అగ్నివీర్, ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. జూన్ 1 నుంచి 12 వరకు ప్రసన్నాయపల్లిలోని ఎన్సీసీఎస్ఏ కేంద్రంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రం వద్ద భద్రత కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
W.G: భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యావరణ పరిరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్వా వ్యర్థ జలాలను నిబంధనలకు విరుద్ధంగా కాలువల్లో వదిలే యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలుష్య ప్రభావంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
KDP: సిద్ధవటం(M)మాచుపల్లి పెన్నానదిలో JCB యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడంపై స్థానిక రైతులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల్లోకి తోలుకోవాలని రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొంది,ఆ ఇసుకను కడపకు తరలించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి,బోర్లలో నీరు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
అన్నమయ్య: మదనపల్లె మండలం ఆవలపల్లిలో శనివారం సాయంత్రం వ్యవసాయ అప్పులు తీరక మనస్తాపానికి గురైన వెంకటేష్ అనే యువ రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
TPT: నారాయణవనంలో జరుగుతున్న కళ్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలలో శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారు ముత్యపు పందిరి వాహనంలో ఆశీనులై భక్తులను కటాక్షిస్తూ ఊరేగారు. తిరువీధి ఉత్సవంలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు పలికారు. ఇంటింటా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. నారాయణవనం తిరువీధులు విద్యుత్ దీపాలంకరణ సంతరించుకున్నాయి.
VZM: చెడు వ్యసనాలకు బానిసై గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందాడు. గంట్యాడ ASI రమణ వివరాల ప్రకారం స్దానిక మధుపాడకు చెందిన నోట్ల అచ్చం నాయుడు చెడు వ్యసనాలకు బానిస కావడంతో తండ్రి మందలించాడు. మనస్థాపానికి గురై గ్రామానికి సమీపంలోని కొబ్బరి తోటలో గడ్డి మందు తాగాడు. తల్లిదండ్రులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
NDL: బనగానపల్లె మండలం పసుపులలో రూ.85.20 లక్షల అభివృద్ధి పనులను శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానికులు, పార్టీ నేతలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, రోడ్డు విస్తరణ పనులతో పాటు జల్ జీవన్ మిషన్ కింద రూ.50 లక్షలతో నిర్మించిన 60 కెఎల్ ఓవర్ హెడ్ ట్యాంక్‌ను బీసీ ప్రారంభించారు.
KRNL: కర్నూలు కలెక్టరేట్లో శనివారం హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.చిరంజీవి, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డి.మహదేవరావు పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. విధి నిర్వహణలో వారు చూపిన నిబద్ధతను కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
CTR: రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ చేపట్టిన గజ గణన ముగిసింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మూడు రోజులపాటు ఏనుగుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గణన చేపట్టారు. మొదటి రెండు రోజులు ఏనుగుల పాదముద్రలు, వెంట్రుకలు, పేడ సేకరించారు. మూడోరోజు ఏనుగులు ఎక్కువగా నీటి కోసం వచ్చే గుంటల వద్ద పర్యవేక్షించారు. ఈ డేటాను అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి పంపనున్నారు.
మన్యం: సాలూరులో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు తన నివాసం నుంచి బైక్‌పై కార్యక్రమానికి చేరుకొన్నారు. కార్యక్రమానికి అధికారులు, పోలీసులు బైక్‌లపై ప్రయాణించి ఇంధన సంరక్షణకు తమ మద్దతును తెలిపారు. కార్ల వినియోగాన్ని తగ్గించి ఇంధన పొదుపుకు అందరూ కృషి చేయాలన్నారు.