సత్యసాయి: విజయవాడలో విద్యుత్, జౌళి శాఖాధికారుల సమన్వయ సమావేశంలో మంత్రి సవిత కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని ప్రకటించారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు రాయితీ కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇందు కోసం రూ.150 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు.
KRNL: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జూద కార్యకలాపాలపై దేవనకొండ పోలీసులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు. గురువారం సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ రమ్మీ, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.
కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టడానికి గ్రోయింగ్స్ తోటల పెంపకానికి ఓఎన్‌జీసీ సహ కారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం ఓఎన్‌జీసీ, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి భూసేకరణ ప్రత్యామ్నాయ భూమి సేకరణ భూ పరిహారాలు చెల్లింపు అంశాలపై సమీక్షించారు.
KDP: జమ్మలమడుగు దిగువపట్నం కాలనీలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. ఆళ్లగడ్డ సుధాకర్ (45) అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రేకుల ఇంట్లో పైపునకు చీరతో ఉరేసుకుని చనిపోయినట్లు చెప్పారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: పదో తరగతి పరీక్షల మూల్యాంకన రుసుమును 100% పెంచాలని కోరుతూ APTF నాయకులు గురువారం DEO శంషుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే స్పెషల్ అసిస్టెంట్లకు TA,DAలు చెల్లించాలని, ట్యాబ్‌లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. APTF జిల్లా అధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నేతలు DEOను కలిసి తమ సమస్యలను వివరించారు.
VZM: గజపతినగరం ప్రోహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని నెలివాడలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జనార్దనరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిందితుడి వద్ద నుంచి 8 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
PPM: అమరావతిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో గడ్డం శేఖర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా పార్వతీపురంలో 200 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఈవో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల సేకరణ చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
AKP: బాల్యవివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయని స్త్రీ శిశు సంక్షేమ మహిళాభివృద్ధి శాఖ పీడీ సూర్యలక్ష్మి అన్నారు. పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గురువారం అనకాపల్లి వైఎంవీఏ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బాల్య వివాహాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. అలాగే, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
ఏలూరు రూరల్ మండలం బాలాజీ నగర్‌కు చెందిన సిరిగోలి భవాని (42) గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో అధిక మోతాదులో మానసిక వ్యాధి టాబ్లెట్లను మింగింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా గురువారం రాత్రి మృతి చెందింది. ఆమె కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.
NDL: నగర పంచాయతీ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నుల చెల్లింపులకు 50 శాతం వడ్డీ మాఫీతో రాయితీ కల్పిస్తున్నట్లు కమిషనర్ హరిప్రసాద్ గురువారం తెలిపారు. ఈ నెల 30 వరకు గడువు పొడిగించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ అందిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వెల్లడించారు.
W.G: పోడూరు మండలం పెనుమదంలో రూ.4 కోట్ల 49 లక్షలతో పలు 17 అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులును ఎదుర్కొంటూ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. మేలుచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. రికార్డుల నిర్వహణ, బోధన విధానాల ఆధారంగా కళాశాలకు ‘A’ గ్రేడ్ లభించినట్లు ప్రిన్సిపల్ శశికళ గురువారం వివరించారు. నాక్‌లో మెరుగైన గ్రేడ్ సాధనకు ఇది దోహదపడుతుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
కోనసీమ: ఏప్రిల్ 14న జరగబోయే అంబేద్కర్ జయంతిని శాంతియుతంగా జరుపుకోవాలని రావులపాలెం సీఐ శేఖర్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రావులపాలెంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గురువారం సాయంత్రం తహసీల్దార్ ముక్తీశ్వరరావు అధ్యక్షతన అంబేద్కర్ జయంతి కమిటీ సభ్యులతో రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు సమావేశం నిర్వహించారు. జయంతి సజావుగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.
KKD: ప్రతి రెండు నెలలకు ఒక సారి కాకినాడ, పిఠాపురంలలో పర్యటిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లా పరిధిలోని ఏ ఒక్క రోడ్డుపై గుంతలు ఉండకూడదని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు.
E:G: కొవ్వూరులో పాత రైల్వే బ్రిడ్జి సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న డంపింగ్ యార్డులో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెత్తకు తరచూ నిప్పు పెట్టడం వల్లే మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ కార్మికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.